‘ఊర సినిమా’ అని మనం దేన్ని అంటాం. మరీ అడ్డగోలుగా మాస్‌ను మాత్రమే ఫోకస్ చేస్తూ… వారికి తప్ప మరెవ్వరికీ నచ్చని విధంగా, ఫుల్లుగా మసాలాను మాత్రమే దట్టించి మరెందుకూ కొరగాని చిత్రాన్ని రూపొందిస్తే దాన్ని మాత్రమే మనం ‘ఊర సినిమా’ అని వ్యవహరిస్తాం. నిజానికి నిర్మాతలు, హీరోలు కథలు వినే సందర్భంలో కూడా మరీ చెత్తగా ఉన్న కథను రచయిత చెప్పాడంటే గనుక.. మరీ ఇంత ఊర కథ తయారుచేసుకు వచ్చాడేంట్రా అని వ్యాఖ్యానిస్తూ ఉండడం కద్దు. అయితే ‘ఊర సినిమా’ అనే ఇండస్ట్రీలో తిట్టు లాగా పరిగణించే ఈ పదాన్ని.. అల్లు అర్జున్ తన తాజా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు బోయపాటి విషయంలో అలవోకగా వాడేయడం.. విస్మయపరిచే విషయం.
బోయపాటి శ్రీనివాస్ అంటే పక్కా మాస్ మసాలా డైరక్టర్ అనే సంగతి అందరికీ తెలుసు. నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్ వంటి మసాలా మాస్ హిట్లు రూపొందించిన ఘనత బోయపాటికి ఉంది. ఇతర హీరోలతోనూ కొన్ని చిత్రాలు చేసినా.. మాస్ మసాలా ఫార్మాట్లోనే ఆయన క్లిక్ అయ్యారు. అయితే తాజాగా ఆయన దర్శకత్వంలో బన్నీ (అల్లు అర్జున్) ప్రస్తుతం సరైనోడు చిత్రం చేశాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో బన్నీ మాట్లాడుతూ.. ఈ సినిమా తల పెట్టాక తన అనుభవాలు వివరించాడు. తన ఫ్రెండ్స్.. ‘నువ్వేమో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ సినిమాలు చేస్తావ్.. బోయపాటి ఊర డైరక్టర్.. మీ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది’ అని తన ఫ్రెండ్స్ అడిగినట్లుగా బన్నీ చెప్పాడు. తన ప్రస్తుత ‘సరైనోడు’ చిత్రం విడుదలయ్యాక.. బోయపాటికి ఉన్న ‘ఊరడైరక్టర్’ అనే ఇమేజి పోయి ఫ్యామిలీ సినిమాలు కూడా తీయగలడనే పేరు వస్తుందని అన్నారు. బన్నీ ఇలా అనడంతో అంతా విస్తుపోయారు. బోయపాటి మొహాన కూడా కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. బన్నీ, బోయపాటిని పొగిడాడో, తిట్టాడో ఎవరికీ అర్థం కాలేదు.
అప్పటికి గానీ బన్నీ తను నోరుజారినదేమిటో అర్థం చేసుకున్నట్లు లేదు. ఆ వెంటనే దిద్దుకుంటూ.. ”ఈ చిత్రం కూడా పరమ ఊర మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్” అంటూ తన చిత్రాన్ని కూడా అదే గాటన కట్టేసి.. కాస్త నోరు జారిన పదం పొరబాటును దిద్దుకునేందుకు బన్నీ తెలివిగా ప్రయత్నంచేశాడు. బోయపాటి సినిమాల మీద మరీ ఊర సినిమాలు, ఆయన ఊర డైరక్టర్ అనే భావన ఇన్నాళ్లూ ఉంటే గనుక.. ఆయన కాంబినేషన్లో సినిమా ఎందుకు చేశారో గానీ.. ఈ మాటలు బాలయ్య విన్నారంటే మాత్రం మరోసారి మెగా క్యాంప్‌పై సందర్భం చూసుకుని ఫైర్ అవుతారేమో!