ఇది ఇప్పటి మాట కాదు… ఓ పదిహేనేళ్ల క్రితం చెప్పాల్సిన మాట. కాని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’తో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే… ఆ సినిమా పట్టాలు ఎక్కడానికి ముందు తేజ దర్శకత్వంలో బన్నీని హీరోగా పరిచయం చేయాలని అల్లు ఫ్యామిలీ అనుకుంది. కొన్ని రోజులు కథాచర్చలు కూడా నడిచాయి. కాని ఎందుకో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. 2003లో ‘గంగోత్రి’ విడుదలైంది. అప్పటికి ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో తేజ పేరు ఓ స్థాయిలో మారుమ్రోగుతోంది. ఉదయ్ కిరణ్‌ని ‘చిత్రం’తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసి, ‘నువ్వు నేను’తో యూత్‌లో స్టార్‌ని చేశారు. ‘జయం’తో నితిన్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి, మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇవన్నీ గమనించిన అల్లు ఫ్యామిలీ బన్నీ తొలి సినిమాను తేజ చేతిలో పెట్టాలని భావించి ఉండొచ్చు. అయితే… కొన్ని ఈక్వేషన్స్ కుదరక సినిమా మెటీరియలైజ్ కాలేదు. ఓ పత్రికకు ఇచ్చిన మదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మదర్ నిర్మల ఈ విషయాన్ని చెప్పారు. బన్నీ మాత్రం ఆ సినిమా గురించి ఏం మాట్లాడలేదు.