సినిమాకేం కావాలి?? యాక్షన్, ఎంటర్టైన్మెంట్, గ్లామర్, ఎమోషన్, హీరోయిజం.. ఇలా చాలా చాలా ఉన్నాయ్. అవన్నీ మా సినిమాలో ఉన్నాయి అని చెప్పడానికే టీజర్లూ, ట్రైలర్లూ కట్ చేస్తారు. అయితే టీజర్లో అన్నీ చెప్పలేరు… చూపించలేరు కాబట్టి ఒకట్రెండు యాంగిల్స్కే పరిమితమవుతారు. అయితే డీజే టీజర్లో దాదాపుగా అన్ని కోణాలూ టచ్ చేసే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్). మొన్న ఫస్ట్ లుక్‌తో ఈసినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు టీజర్ కూడా ఆ హీట్‌ని మరింత పెంచేసింది.
మహా శివరాత్రి సందర్భంగా టీజర్‌ని వదిలారు. బన్నీ లుక్.. ముందు నుంచీ ఊహిస్తున్నట్టుగా సంప్రదాయ బ్రాహ్మణ యువకుడిగా సూపర్బ్‌గా కుదిరింది. ఇందులోనే మరో షేడ్ ఉందన్న విషయం… టీజర్ గుర్తు చేస్తూనే ఉంది. ఇలా ఇలా ముద్దులు పెట్టేసి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనే డైలాగ్‌లో.. హీరో క్యారెక్టరైజేషన్‌కీ, ఈ సినిమాలో పండబోయే వినోదానికీ క్లూ ఇచ్చేసినట్టైంది. అందరూ ఈ సినిమాలో అదుర్స్‌లో చారి పాత్రతో పోలుస్తున్నారు. అయితే ఆ ఛాయలేవీ పడకుండా బన్నీ కాస్త జాగ్రత్త పడినట్టు అర్థమవుతూనే ఉంది. ఇక పూజా హెగ్డే తన గ్లామర్ డోస్‌ని కాస్త పెంచినట్టే అనిపిస్తోంది. విజువల్‌గా ఇక చెప్పక్కర్లెద్దు. డీఎస్పీ మరోసారి ఆర్.ఆర్‌తోనే మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు. టోటల్‌గా ఈ సినిమా చూడాల్సిందే అనే ఆసక్తి టీజర్ కలిగించగలిగింది. ఈ శివరాత్రికి.. డీజే గిఫ్టూ అదిరిపోయింది.