మెగా హీరోలందరూ మాటకారులే. వరుణ్ తేజ్ తప్ప. వరుణ్ పెద్దగా మాట్లాడడు. సినిమా ప్రచారంలోనూ కాస్త మొహమాట పడుతుంటాడు. అయితే ‘మట్కా’ కోసం మాత్రం కొంత ఓపెన్ అయ్యాడు. ప్రమోషన్లు చురుగ్గా చేశాడు. ప్రీ రిలీజ్ లో వరుణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎవరూ మూలాల్ని మర్చిపోకూడదని, కెరీర్ ప్రారంభంలో సపోర్ట్ చేసిన వాళ్ల పేర్లు తలచుకోకపోతే ఎంత ఎదిగినా దానికి అర్థం ఉండదని పరోక్షంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో రెండు రోజుల పాటు దీనిపై చర్చ నడిచింది. వరుణ్ మాట్లాడింది నిజమే అని కొందరు, కేవలం ప్రమోషన్ల కోసమే వరుణ్ ఇలా మాట్లాడాడని మరికొందరు… ఎవరి వ్యాఖ్యానాలు వాళ్లు చేశారు. అయితే వరుణ్ కామెంట్లని బన్నీ ఫ్యాన్స్ చాలా పర్సనల్ గా తీసుకొన్నారు. ‘మట్కా’ విడుదల అవుతుంది కదా, చూసుకొందాం – అనే రేంజ్లో రీట్వీట్లు చేశారు.
‘మట్కా’ వచ్చింది. ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. దాంతో బన్నీ ఫ్యాన్స్ కు కావల్సినంత పని దొరికింది. వరుణ్‌తేజ్ గత సినిమాల్ని, ఫ్లాపుల్నీ, అవి సాధించిన వసూళ్లనీ పనిగట్టుకొని షేర్ చేస్తున్నారు. వరుణ్ ఫ్లాప్ సినిమా కలక్షన్లు, బన్నీ తొలి రోజు వసూళ్లని మ్యాచ్ చేసి పోస్టులు షేర్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమాలు సాధించిన మొత్తం వసూళ్లు బన్నీ సినిమా తొలి రోజు వసూళ్లకంటే తక్కువంటూ అంకెలతో సహా లెక్క చెబుతున్నారు. నిజానికి బన్నీ ఫ్యాన్స్ కి సైతం వరుణ్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండేది. నాగబాబు – బన్నీ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ ఉన్నా, వరుణ్ పై నెగిటీవ్ ప్రాపకాండ చేసేవాళ్లు కాదు. కానీ ‘మట్కా’ ప్రీ రిలీజ్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్ల వల్ల ‘మట్కా’ సినిమా రిజల్ట్ ని సైతం వాళ్లు పర్సనల్‌గా తీసుకొన్నారు. దాంతో ‘మట్కా’కు అవ్వాల్సిన డామేజీ కంటే కాస్త ఎక్కువే జరిగిందనుకోవాలి.