‘గీత గోవిందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. మళ్ళీ ‘టాక్సీవాలా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వచ్చాడు. ఇందులో ఫిల్మ్ ఇండస్ట్రీలోని మ్యాగ్జిమమ్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అల్లు అర్జున్ స్పందించాడు. తన స్పందనలకు ‘టాక్సీవాలా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఫుల్లుగా వాడేసుకున్నాడు. ఒక్కో టాపిక్ చూస్తే…
– మీటూ మూమెంట్ గురించి…
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ అండ్ హ్యాపెనింగ్ టాపిక్ ‘మీటూ’. ఇండస్ట్రీలో హీరోయిన్లు, ‘మీటూ’ మూమెంట్స్ వచ్చినప్పుడు తను, తన అమ్ముడు అల్లు శిరీష్ డిస్కస్ చేసుకుంటామని అల్లు అర్జున్ అన్నాడు. “ఇండస్ట్రీలు అన్నిటిలోకి హీరోయిన్లకు మ్యాగ్జిమమ్ రెస్పెక్ట్ ఇచ్చే ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. ఏ హీరోయిన్ని అడిగినా ఇదే మాట చెబుతారు. ఇండస్ట్రీకి ఎక్కువమంది అమ్మాయిలు ధైర్యంగా రావచ్చు” అని అల్లు అర్జున్ అన్నాడు.
– నెక్స్ట్ సినిమా ఏంటి?
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడం ఖాయమే. అయితే… ఆ విషయాన్ని అల్లు అర్జున్ చెప్పలేదు. “నా తదుపరి సినిమా గురించి ప్రస్తుతం అడగొద్దు” అన్నాడు స్టయిలిష్ స్టార్!
– ఎవరు తెలుగువాళ్లు?
‘ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు తక్కువ, కథానాయికలుగా తెలుగమ్మాయిలు రావడం లేదు’ ఓ చర్చ నడుస్తుంది. ‘టాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ మరాఠీ అమ్మాయి. కానీ, అనంతపూర్ జిల్లాల్లో పెరిగింది. ‘తను తెలుగమ్మాయా?’ అని ఆరా తీయగా… ‘కాదండీ. మరాఠీ అమ్మాయి’ అని బన్నీకి చెప్పార్ట! దీనికి అల్లు అర్జున్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? “తెలుగుతనాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ నా దృష్టిలో తెలుగువాళ్లే” అని!
– విజయ్ దేవరకొండ… సెల్ఫ్‌మేడ్ స్టార్!
విజయ్ దేవరకొండకు అతి తక్కువ సమయంలో వచ్చిన స్టార్డమ్ చూసి కొందరు అసూయ పడుతున్నారని అల్లు అర్జున్ అన్నాడు. విజయాలకు విజయ్ దేవరకొండ అన్ని విధాలా అర్హుడని ఆయన తెలిపారు. తాను రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యానని, విజయ్ దేవరకొండ అలా కాకుండా తనకు తానుగా ఎదిగాడని, సెల్ఫ్‌మేడ్ స్టార్ అని పొగిడాడు. తనకంటే విజయ్ దేవరకొండకు ఎక్కువ పేరు వస్తే సంతోషిస్తానని, అతడు నెగిటివ్ టాక్ గురించి పట్టించుకోకుండా వుంటే మంచిదని అన్నాడు.
– ఆర్ఆర్ఆర్!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రారంభమైన ‘ఆర్ఆర్ఆర్’ గురించీ ‘టాక్సీవాలా’ ఈవెంట్లో అల్లు అర్జున్ ప్రస్తావించాడు. తన ఫెవరెట్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి, తను సరదాగా బావ అని పిలుచుకునే తారక్‌కి, దేశం గర్వించే దర్శకుడు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపాడు.
– రౌడీ డ్రస్సింగ్ స్టయిల్!
విజయ్ దేవరకొండ ప్రతి ఫంక్షన్‌కి డిఫరెంట్ స్టయిల్లో వస్తాడు. ‘టాక్సీవాలా’కీ అలాగే వచ్చాడు. అతడి డ్రస్సింగ్ స్టయిల్ బావుందని అల్లు అర్జున్ కితాబు ఇచ్చాడు. నెక్స్ట్ టైమ్ విజయ్ దేవరకొండ ఫంక్షన్‌కి రావాలంటే అతను నాకో స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయించాలని కోరాడు. అందుకు బదులుగా విజయ్ దేవరకొండ తనే స్వయంగా డిజైన్ చేస్తానని చెప్పాడు.