దక్షిణాదిలోని ప్రతిభావంతులైన యువ దర్శకుల్లో అట్లీ ఒకడు. ‘జవాన్’ హిట్ తో బాలీవుడ్ లోనూ తన పేరు మార్మోగిపోయింది. దాంతో తెలుగు హీరోలు అట్లీతో సినిమా చేయడానికి తెగ ఉత్సాహం చూపించారు. వాళ్లలో అల్లు అర్జున్ ఒకడు. అల్లుతో అట్లీ కాంబో కొన్నాళ్ల క్రితమే ఫిక్సయ్యింది. `పుష్ష 2` అవ్వగానే… అట్లీ సినిమా మొదలెట్టాలని బన్నీ ఉత్సాహం చూపించాడు. త్రివిక్రమ్ సినిమా సైతం పక్కన పెట్టి, అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనుకొన్నాడు. అట్లీ కూడా.. బన్నీ కోసం ఓ కథ రెడీ చేశాడు. అయితే ఇక్కడ సీన్ మారింది.
అట్లీ రెడీ చేసిన కథ బన్నీకి నచ్చలేదని టాక్. మరో కొత్త కథ రాయమని అట్లీకి సున్నితంగా చెప్పేశాడట. దాంతో బన్నీ – అట్లీ సినిమా ఇప్పుడు మరోసారి డైలామాలో పడింది. బన్నీ మూడ్ మొత్తం ‘పుష్ష 2’పై ఉందని, అది అవ్వగానే పార్ట్ 3 కూడా పూర్తి చేసేసి, అప్పుడు… మిగిలిన ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుకుమార్ మాత్రం ‘పుష్ష 2’కీ ‘పుష్ష 3’కీ మధ్య కాస్త గ్యాప్ ఉంటే మంచిదని ఫీలవుతున్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ.. ‘పుష్ష 3’కి గ్యాప్ కావాలని అనుకొంటే, త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాడు బన్నీ. ఈలోగా.. అట్లీ మరో కథతో వస్తే, అప్పుడు బన్నీ ఆలోచనలు కూడా మారిపోవొచ్చు. ఇప్పుడు బన్నీ సినిమా ఎవరితో అనేది పూర్తిగా సుకుమార్ చేతుల్లోనే ఉంది.