హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆరోగ్యపరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయని, సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసకుంటున్నాడని పుకార్లు జోరుగా షికారు చేస్తుండటమే దీనికి కారణం. అల్లు అర్జున్‌కు ఏదో అయిందని, ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించాయి. దీనితో ఆయన తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అర్జున్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎలాంటి గాయాలు కాలేదని అరవింద్ ప్రకటించారు. తాము ఆసుపత్రికి వెళ్ళినమాట నిజమేనని, అది బన్నీ గురించి కాదని తెలిపారు. బన్నీ భార్య స్నేహలతకు చిన్నపాటి శస్త్రచికిత్స చేయించేందుకే వెళ్ళామని చెప్పారు. బన్నీకి చిన్నపాటి ఆరోగ్యసమస్యకూడా లేదని వెల్లడించారు. గతంలో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో స్నేహలత గాయపడ్డారని, ఆ క్రమంలోనే ఆమెకు ఆపరేషన్ చేయించేందుకు ఆసుపత్రికి వెళ్ళామని తెలిపారు. ఇవాళ సాయంత్రంలోగా ఆమెను డిశ్ఛార్జి చేస్తారని అరవింద్ వెల్లడించారు.