ప్రజలు ఏం చూడటానికి ఇష్టపడుతున్నారో మీడియా కూడా అదే చూపిస్తుంది. ఎంత విలువైన అంశం కూడా విజిబిలిటీ, రిడబిలిటీ లేకపోతే ఆ వార్తని ప్రముఖంగా ప్రస్థావించడానికి మీడియా సంస్థలు కూడా ఆసక్తిని చూపించవు. ఇప్పుడు అందరి కన్ను అల్లు అర్జున్ ఇష్యూ పై పడింది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట, ఓ మహిళ మృతి, ఆమె కొడుకు చావు బ్రతుకుల మధ్య వుండటం, అల్లు అర్జున్ అరెస్ట్, తర్వాత ఆయనకి పరామర్శలు, అసెంబ్లీలో ప్రస్తావన, అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత పోలీసులు ప్రెస్ మీట్, ఇప్పుడు మళ్ళీ పోలీసుల నుంచి బన్నీకి పిలుపు… ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టాపిక్ అయిపొయింది.
అల్లు అర్జున్ అప్డేట్స్ కి తప్పితే మరో వార్తకి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. చివరికి పుష్ప2 విజయం కూడా ఈ వివాదం ముందు చిన్నబోయింది. దానికి వచ్చిన కలెక్షన్స్, అది కొట్టిన రికార్డ్స్ పై ఎవరికీ ఆసక్తి లేదు. పుష్ప పరిస్థితే అలా వుంటే మిగతా సినిమాల సందడి అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి సంక్రాంతి సినిమాల హంగామా ఈ పాటికే మొదలైపోవాలి. ఆమెరికాలో గేమ్ చెంజర్ ఈవెంట్ పెట్టారు. నిజానికి ఇలాంటి ఫస్ట్ టైం ఈవెంట్ పెడితే తెలుగు మీడియాలో కూడా మంచి కవరేజ్ వుండాలి. కానీ సరిగ్గా అదే టైంకి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. దీంతో అల్లు అర్జున్ వివాదమే హైలెట్ అయ్యింది.
రీసెంట్ గా డాకు మహారాజ్ ప్రెస్ మీట్ జరిగింది. సినిమాలో కంటెంట్ కంటే సంధ్య థియేటర్, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల గురించి మీడియా ఆసక్తి చూపించింది. గత వారం వచ్చిన సినిమాలని ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. బచ్చల మల్లికి ప్రెస్ మీట్ లాంటిది పెట్టాలని అనుకున్నారు కానీ ఇప్పుడున్న మూడ్ ముందు ఆ ప్రెస్ మీట్ నిలబడదని అర్ధమైయింది. ఈవారం వస్తున్న సినిమాలపై ఎవరికీ ఆసక్తి కనిపించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్ వుడ్ సినిమాని వాయిదా వేసి మంచి పని చేశారు.
రెగ్యులర్ అప్డేట్స్ పై కూడా ఫ్యాన్స్ ఆసక్తిని చూపడం లేదు. నాగచైతన్య తండేల్ నుంచి శివశక్తి పాటని విడుదల చేయాలని అనుకున్నారు. అది అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న సినిమా. ఆట పాటలకు ఇది సమయం కాదని పాట విడుదల సైతం వాయిదా వేసుకున్నారు. మొత్తానికి ఇప్పుడు మీడియాలో అల్లు అర్జున్ మాస్ హిస్టీరియా నడుస్తోంది.