హైదరాబాద్: అవును ఈ మాట ఆయనే చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళయినా ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ చేయలేకపోయానే అనే డిప్రషన్ లోలోపల ఉందని అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉందని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానంగా, తాను చిన్నపిల్లాడిలా కనిపిస్తానని, కానీ తనకు 32 ఏళ్ళు వచ్చాయని అన్నారు. తనకు పనంటే ప్రేమని, ఎంత గొప్ప పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదని, చేసేపని గొప్పగా చేయాలన్నది తన పట్టుదల అని చెప్పారు. చిరంజీవి, రాజమౌళి వంటివారు అలాగే ఆ స్థాయికి చేరుకున్నారని అన్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే ఉద్యోగమయినా వరల్డ్ బెస్ట్ అనిపించుకుంటే అతనంటే తనకు గౌరవముంటుందని చెప్పారు.
చిరంజీవి ఫ్యాన్ బేస్ తనకు ప్రాధమికంగా ఉపయోగపడిందని అల్లు అర్జున్ అన్నారు. ఆ తర్వాత ప్రూవ్ చేసుకునేదానినిబట్టి కొత్త అభిమానులు ఏర్పడతారని చెప్పారు. తనకు అలాంటి సైలెంట్ ఫ్యాన్స్ ఉన్నారని అన్నారు. చిరంజీవి 151వ సినిమా గీతా ఆర్ట్స్‌లో చేయాలనుకుంటున్నామని చెప్పారు. తన మొదటి సినిమా దగ్గరనుంచి మొదలుపెట్టి, అదే ఆర్డర్లో చరణ్ సినిమాలతో పోల్చి చూస్తే తనకంటే చరణే బాగా చేశాడని అన్నారు. శ్రీమంతుడు విజయంపై చరణ్ తప్ప మరే తెలుగు హీరో ఫోన్ చేయలేదని మహేష్ చేసిన వ్యాఖ్యలు మీడియాల చూసి ఆయనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని తెలిపారు.