‘పుష్ప 2’ తరవాత అల్లు అర్జున్ సినిమా ఏమిటన్నదానిపై నిన్న మొన్నటి వరకూ భయంకరమైన క్లారిటీ ఉండేది. ఆయన త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నారని, దాని కోసమే ప్రిపేర్ అవుతున్నారని ఇండస్ట్రీ మొత్తం అనుకొంది. బన్నీ ఫ్యాన్స్ కూడా అదే ఫిక్సయ్యారు. అయితే ఇప్పుడు సడన్ గా అట్లీ వచ్చి చేరిపోయాడు. త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా, అట్లీ సినిమా మొదలవుతుందన్న ఓ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. బన్నీ – అట్లీ కాంబోలో ఓ సినిమా ఉంటుంది. అది ఖాయం. కాకపోతే.. త్రివిక్రమ్ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తక్కువ.
త్రివిక్రమ్ బన్నీ కోసం ఓ కొత్త తరహా కథ రాస్తున్నారు. దీని స్పాన్ కూడా చాలా ఎక్కువ. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ సమయం తీసుకొంటున్నారు. విజువల్ గా కొంత ప్రీ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న సినిమా ఇది. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సీన్స్ డిజైన్ చేయాలి. పైగా ఈ జోనర్ త్రివిక్రమ్‌కు పూర్తిగా కొత్త. అందుకే త్రివిక్రమ్ ఇంత టైమ్ తీసుకొంటున్నారు. ఒకసారి మొదలైతే.. నాన్ స్టాప్‌గా షూట్ చేస్తూనే ఉంటారు. మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ కి టైమ్ పడుతుంది. బన్నీ కూడా త్రివిక్రమ్ సినిమా తొందరగా మొదలైతే బాగుంటుందని ఆశ పడుతున్నాడు. ‘పుష్ప 2’ తరవాత.. తనకు ఇదే పర్ఫెక్ట్ సినిమా అవుతుందన్నది బన్నీ నమ్మకం. అందుకే.. త్రివిక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏక కాలంలో రెండు సినిమాలు చేయడం కష్టం. ఎందుకంటే త్రివిక్రమ్ ది పెద్ద ప్రాజెక్ట్. అట్లీ కూడా చిన్న సినిమాలేం తీయడు. తను కూడా పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో ఉంచుకొనే కథ రాస్తాడు. రెండు సినిమాల్లోనూ గెటప్పులు మారతాయి. కాబట్టి.. ఒకేసారి రెండు ప్రాజెక్టులు దాదాపు అసాధ్యం. ఒకవేళ త్రివిక్రమ్ `నా ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుంది… ఈలోగా నువ్వేమైనా చేసుకో` అని అంటే గనుక.. బన్నీ అట్లీని ఓ ఆప్షన్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ త్రివిక్రమ్ మరో యేడాది ఆగాలి. బన్నీ – త్రివిక్రమ్ కలిసి మాట్లాడుకొంటే తప్ప – ఈ గందరగోళానికి తెరపడదు.