పోలీసులు పిలిచారు. వివాదం లేకుండా వెళ్లారు. మూడున్నర గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వచ్చారు. లోపల ఏం అడిగారో.. ఏం చెప్పారో ఎవరికీ తెలియదు కానీ.. మీడియాలో మాత్రం పోలీసులు అడిగిన వాటికన్నింటికి ప్రెస్మీట్లో చెప్పినవే సమాధానాలు చెప్పారని లీకులు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు మాత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలకు.. బయట సాక్ష్యాలకు మధ్య ఉన్న తేడాను ప్రధానంగా ఆయన దగ్గర ప్రస్తావించి అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు చేసే క్రాస్ ఎగ్జామినేషన్ నేరుగా ఉండదు. నిందితులు డైరక్ట్ గా ప్రశ్నలు వేయరు. తమకు కావాల్సిన సమాధానం నేరుగా వేసే ప్రశ్నల ద్వారా రాదని వారికీ తెలుసు. అందుకే ఓ ప్రశ్నకు వచ్చే సమాధానం ద్వారార మరో ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటారు. రేవతి మృతి ఎప్పుడు తెలిసిందన్న అంశంపై పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. రేవతి మృతి విషయం అల్లు అర్జున్ కు ధియేటర్ లో ఉన్నప్పుడే తెలుసన్నది పోలీసుల ప్రకటన. ఆ ప్రకటన ప్రకారం అర్జున్ కు ముందే తెలుసని నిరూపించేలా ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మూడున్నర గంటల సేపు విచారించారు. తర్వాత తండ్రితో కలిసి ఇంటికి వెళ్లిపోయారు.
అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్న సమయంలోనే .. ఓ టీం సంధ్యా ధియేటర్ కు వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసింది. మరో టీం.. అల్లు అర్జున్ ప్రైవేటు ఈవెంట్స్ బౌన్సర్లను సరఫరా చేసే ఆంటోనీని అరెస్టు చేసింది. ఈ ఆంటోనీ ఆధ్వర్యంలోని బౌన్సర్లే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ధియేటర్ ను నియంత్రించారు. తొక్కిసలాటకు వారే కారణమయ్యారని.. పోలీసుల్ని సైతం తోసేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంటోని అరెస్టు అల్లు అర్జున్ శిబిరంలో కలకలం రేపింది.