కన్నడనాట అల్లు అర్జున్ కి చేదు అనుభవం ఎదురైంది. పుష్ఫ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా బన్నీ కన్నడ సీమలోకి అడుగుపెట్టాడు. బుధవారం అక్కడ ఓ ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ కి బన్నీ రెండు గంటలు ఆలస్యంగా వచ్చాడు. బన్నీ కోసం అక్కడి మీడియా అంతా ఎదురు చూడాల్సివచ్చింది. దాంతో ఓ పాత్రికేయుడు `మీరు ఆలస్యంగా వచ్చారు. మీ కోసం మేమంతా ఎదురు చూశాం. కనీసం సారీ కూడా చెప్పకుండా ప్రెస్ మీట్ మొదలెట్టేశారు..` అని అడగడంతో బన్నీ అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని మీడియాకు సారీ చెప్పాడు. పొగమంచువల్ల స్పెషల్ ఫ్లైట్ ఆలస్యమైందని, అందుకే లేట్ గా రావల్సివచ్చిందని, సారీ చెప్పడానికి తను సంకోచిచనని, సారీ చెప్పడం వల్ల మనిషి ఎదుగుతాడు తప్ప, తగ్గడని బన్నీ సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి.. మీడియా అంతా సంతృప్తి చెందింది. ఆ తరవాత ప్రెస్ మీట్ యధావిధిగా కొనసాగింది.
మంగళవారం కూడా… హైదరాబాద్ లో ఇదే సీన్ జరిగింది. హైదరాబాద్లో సాయింత్రం 5 గంటలకు బన్నీ ప్రెస్ మీట్ పెట్టారు. మీడియావాళ్లు అనుకున్న సమయానికంటే ముందే వచ్చినా.. బన్నీ గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. కానీ ఇక్కడ సారీ అడిగింది లేదు. చెప్పింది లేదు. ప్రెస్ మీట్లకు, ఇంటర్వ్యూలకూ, ప్రీ రిలీజ్ ఫంక్షన్లనూ హీరోలు లేట్ గానే వస్తారు. కానీ సారీ చెప్పింది లేదు. మీడియాని ఎదురుచూసేలా చేయడం కొంతమంది హీరోలు టేకిట్ ఫర్ గ్రాంట్ గా తీసుకుంటారు. హీరోల కోసం ఎదురు చూసీ, చూసీ అలసిపోవడం తెలుగు మీడియాకీ అలవాటైపోయింది. ఈ విషయంలో తెలుగు మీడియా పెద్ద మనసుతోనే ఆలోచిస్తోంది. ఆ తేడా బన్నీకి ఇప్పుడు తెలిసి ఉంటుంది