ఎలాంటి కథలు చేయాలి? ఎప్పుడు ఏ దర్శకుడితో పనిచేయాలి? అనే విషయాలు తెలిసి ఉండడం చాలా కీలకం. మంచి కథని ఎంచుకోవడంలో ఎంత నేర్పరితనం కావాలో… ఎలాంటి కథకు `నో` చెప్పాలి అనే విషయంలోనూ అంతే తెలివితేటలు అవసరం. ఈ విషయంలో అల్లు అర్జున్ బుర్ర కాస్త షార్ప్ గానే పనిచేస్తోంది. అందుకే.. చాలా ఫ్లాపుల్ని తప్పించుకోగలిగాడు. ఇటీవల సాయిధరమ్ తేజ్ `సోలో బతుకే సో బెటరు` అంటూ… పలకరించాడు. ఈ సినిమాకి బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే వచ్చినప్పటికీ.. సినిమాలో ఇందులో విషయం లేదన్నది అర్థం అవుతోంది. నిజానికి ఈ కథ.. ముందు బన్నీకి వినిపించాడు దర్శకుడు సుబ్బు. తను ఈ కథని రిజెక్ట్ చేయడంతో.. సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది.
గ్యాంగ్ లీడర్ కథని విక్రమ్ కె.కుమార్… ముందు బన్నీకే వినిపించాడు. ఈ కథని ముందు ఓకే చేసినా.. కొన్ని మార్పులు సూచించాడు బన్నీ. కానీ.. ఆ మార్పులు చేయడానికి విక్రమ్ నో చెప్పాడు. అలా ఆ ప్రాజెక్టు నుంచి బన్నీ డ్రాపవుట్ అయ్యాడు. అదీ లక్కీ ఎస్కేపే. `వినయ విధేయ రామా` కథని.. ముందు అల్లు అర్జున్ కే వినిపించాడు బోయపాటి శ్రీను. ఆ కథ బన్నీకి ఎక్కలేదు. ఆ స్థానంలోనే `సరైనోడు` పట్టాలెక్కింది. వి.ఐ ఆనంద్ బన్నీ కోసం సినిమా చేయాలని చాలా తహతహలాడాడు. `డిస్కో రాజా` కథ.. బన్నీ చుట్టూ కొన్ని రోజులు తిరిగింది. గీతా ఆర్ట్స్‌లో నెలల తరబడి కూర్చుని ఈ కథపై కసరత్తులు చేశాడు ఆనంద్. అయితే స్క్రిప్టు మొత్తం అయ్యాక.. బన్నీ నో చెప్పాడు. అలా.. మరో ఫ్లాపు బన్నీ ఖాతా నుంచి జారిపోయింది. ఇలా… వరుసగా ఫ్లాపుల నుంచి తప్పించుకోగలిగాడు బన్నీ.