‘పుష్ష’తో బాలీవుడ్ లోనూ తన సత్తా చూపించాడు అల్లు అర్జున్. నిజానికి సౌత్‌లో కంటే ఈ సినిమా నార్త్ లో బాగా ఆడింది. పుష్షగా బన్నీ మేనరిజం, డైలాగులూ అక్కడ మరింత పాపులర్ అయ్యాయి. ఆ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకొని, తన పేరు మరోసారి బాలీవుడ్‌కి గట్టిగా వినిపించేలా చేశాడు బన్నీ. నిజానికి ‘పుష్ష’లాంటి హిట్టు కొట్టిన తరవాత ఎలాంటి హీరో అయినా, బాలీవుడ్ ప్రాజెక్టులపై కన్నేస్తాడు. అక్కడి దర్శకులతో పని చేయాలని చూస్తాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నారు. ‘మగధీర’ తరవాత రామ్ చరణ్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత అది మరింత ఎక్కువైంది. ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో ‘వార్ 2’లో నటిస్తున్నాడు.
అయితే… తనని తాను మార్కెటింగ్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే బన్నీ మాత్రం బాలీవుడ్ గురించి ఆలోచించకపోవడం విచిత్రంగా తోస్తోంది. ‘పుష్ష’ తరవాత ఒకరిద్దరు బాలీవుడ్ డైరెక్టర్లు బన్నీని వెదుక్కొంటూ వచ్చారు. అందులో సంజయ్‌లీలా బన్సాలీ లాంటి దిగ్గజం కూడా ఉన్నాడు. బన్నీ తలచుకొంటే ‘పుష్ష 2’ తరవాత బాలీవుడ్ లో ఓ సినిమా చేసేయొచ్చు. కానీ.. బన్నీ మాత్రం అలాంటి ఆలోచనలో లేడు. హిందీలో నేరుగా ఓ సినిమా చేయడం కంటే, ఓ తెలుగు సినిమా చేసి బాలీవుడ్ వాళ్లని మెప్పించడమే బెటర్ అనుకొంటున్నాడు. ‘పుష్ష’ ఏం బాలీవుడ్ సినిమా కాదు. అందులో బాలీవుడ్ నటులూ లేరు. కానీ నార్త్‌లో ఆడింది. అలానే తెలుగులోనే, తెలుగు నటీనటులు తెలుగు టెక్నీషయన్లతో సినిమాలు తీసి, బాలీవుడ్ ని మెప్పించడంలోనే ఎక్కువ సక్సెస్ ఉందని భావిస్తున్నాడు బన్నీ. తెలుగులో అందరి హీరోలకంటే మలయాళంలో ముందుగా మార్కెట్ సంపాదించింది బన్నీనే. బన్నీతో ఓ మలయాళం సినిమా చేయించాలని చాలామంది భావించారు. కానీ బన్నీ అప్పుడు కూడా ఇంతే. తెలుగు సినిమా తీసి, మలయాళంలో మెప్పించడంలోనే కిక్ ఉందనుకొన్నాడు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. ఓరకంగా ఎత్తుగడ కరెక్టే. హిందీ వాళ్లకు ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. వాళ్లు డబ్బింగ్ సినిమాలైనా చూస్తారు కానీ, ఎక్కడి నుంచో వచ్చి, తమ భాషలో సినిమా తీస్తే చూడ్డానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకు బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. సౌత్ స్టార్లు రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇది వరకే బాలీవుడ్ లో సినిమాలు చేశారు. కానీ.. అక్కడి జనం పెద్దగా ఆదరించలేదు. రామ్ చరణ్ ‘తుఫాన్’, ప్రభాస్ చేసిన ‘ఆదిపురుష్’ ఇందుకు లేటెస్ట్ ఉదాహరణలు. అందుకే.. అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ సినిమా విషయంలో పెద్దగా ఉత్సాహం చూపించడం లేదేమో.