రాత్రంతా చంచల్ గూడా జైల్లో గడిపిన అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే ఇంటికి చేరుకొన్నాడు. ఇంటి దగ్గర బన్నీని చూడగానే.. కుటుంబం అంతా భావోద్వేగాలకు గురైంది. బన్నీ కూడా చాలా హుషారుగా, ధైర్యంగా కనిపించాడు. మీడియా ముందు మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎలాంటి కొత్త వివాదాలకూ చోటు ఇవ్వలేదు. అయితే ఇక్కడితో ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినట్టు కాదు. ఈ అరెస్ట్ ప్రభావం ఇంకొంత కాలం ఉండే ఛాన్సుంది. బన్నీకి దొరికింది మధ్యంతర బెయిల్ మాత్రమే. ఈ బెయిల్ వల్ల 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గాల్సిన బాధ తప్పింది. కాకపోతే ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈ అరెస్ట్ వల్ల బన్నీ ప్లాన్స్ అన్నీ అప్ సెట్ అయిపోయాయి.
ఈవారం అంతా పుష్ప 2 కోసం ప్రచారం చేద్దామనుకొన్నాడు అల్లు అర్జున్. నార్త్ లో రెండో దఫా ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టాడు కూడా. హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. తాను చేయాల్సింది, తిరగాల్సింది చాలా వుంది. అయితే ఇంతలోనే అరెస్ట్ అవ్వాల్సివచ్చింది. దాంతో `పుష్ప 2` ప్రమోషన్లకు గండి పడినట్టైంది. ఈ ప్రమోషన్లు అవ్వగానే తన కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్దామనుకొన్నాడు. అది ఇప్పట్లో లేనట్టే. కొన్నాళ్లు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు బన్నీ దూరం కావాల్సివస్తోంది.
మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర అభిమానుల తాకిడి పెరుగుతోంది. బన్నీని చూడడానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. వాళ్లని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు తలకు మించిన పనే. ఈరోజంతా బన్నీని చూడడానికి సినీ, రాజకీయ ప్రముఖులు వస్తారని తెలుస్తోంది. చిరంజీవి కూడా బన్నీని ఈరోజే కలిసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.