‘అర్జున్‌రెడ్డి’ సినిమాపై, విజయ్ దేవరకొండ నటనపై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘గీత గోవిందం’ ఆడియోకి అతను ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే… సినిమా నిర్మాత అతని తండ్రి అల్లు అరవింద్ కాబట్టి! విజయ్ దేవరకొండ కూడా స్టేజి మీద సరదాగా అదే విషయం చెప్పాడు. ‘బన్నీ అన్న వాళ్ల నాన్న కోసం వచ్చి ఉంటారు’’ అన్నాడు. అయితే… అల్లు అర్జున్ మాత్రం బన్నీ వాసు కోసం ‘గీత గోవిందం’ ఆడియోకి వచ్చానని తెలిపాడు. తర్వాత సినిమా చూశానని, అద్భుతంగా ఉందని కొనియాడాడు. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ‘‘అర్జున్‌రెడ్డి’ చూసిన తర్వాత వారం రోజులు నేనెవరితోనూ మాట్లాడలేదు. కావాలంటే వాసుని అడగండి…. వారం రోజులు ఎవరినీ కలవలేదు. ‘ఎహె… మనం ఏ సినిమాలు చేస్తున్నాం’ అనుకున్నా. వన్ వీక్ టు టెన్ డేస్… బాగా డిస్ట్రబ్ అయిపోయా. ఆ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చింది. మనకున్న అవార్డ్స్‌లో బెటర్ అవార్డ్స్ ఫిల్మ్‌ఫేర్. ఆ ఇయర్ ఇద్దరు ముగ్గురు బాగా చేసినా… తనకి రావాలని అనుకున్నా. హీరోల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనస్ఫూర్తిగా తనకి ఫిల్మ్‌ఫేర్ రావాలనుకున్నా. తనకి బెస్ట్ డెబ్యూ, అలా సర్దే అవార్డ్స్ ఇవ్వకూడదని అనుకున్నా’’ అన్నాడు. చివర్లో విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేశాడు. ‘‘తెలుగులో మంచి మంచి నటులున్నారు. అతికొద్ది మంది గొప్ప నటులున్నారు. విజయ్ దేవరకొండ గొప్ప నటుడు’’ అని అల్లు అర్జున్ చెప్పాడు. తర్వాత అతణ్ణి గారు అని సంబోధించాడు. ‘‘నిజానికి ‘గీత గోవిందం’ ఫీమేల్ స్ర్కిప్ట్. కానీ, విజయ్ దేవరకొండగారు ఎంత బాగా చేశారంటే… ఇది ఒక అమ్మాయి–అబ్బాయి కథ అన్నట్టు చేశాడు’’ అని వ్యాఖ్యానించాడు. ‘క్లీన్’ సినిమా అని సర్టిఫికేట్ ఇచ్చాడు.