బెయిల్ షరతుల మేరకు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సంతకం పెట్టాల్సి ఉంది. ఈ మేరకు ఉదయమే వెళ్లి సంతకం పెట్టి వెళ్లారు అల్లు అర్జున్. చిక్కడపల్లిలో సంతకం పెట్టిన తర్వాత కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించాలని అనుకున్నారు. కానీ పోలీసులకు సమాచారం తెలిసి అలా వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారు. అర్జున్ అక్కడికి సమాచారం ఇవ్వకుండా వెళ్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఎవరికీ తెలియకుండా వీలైనంత గుట్టుగా పరామర్శించి వెళ్తే క్రౌడ్ కు అవకాశం లేకుండా పోతుంది . అయితే ఆయన ఆస్పత్రికి వస్తాడన్న సమాచారం ముందుగా బయటకు రావడంతో కొంత మంది అప్పటికే ఆస్పత్రి వద్ద గూమికూడారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఇంటికి వెళ్లి ఆస్పత్రికి వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారు.
శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప టీం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. ఆయన కోమా నుంచి బయటకు వచ్చినా ఎవర్నీ గుర్తు పట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలో ఆ పిల్లవాడి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం లేదు.