అల్లు అర్జున్ అంటే స్టైల్ ఐకాన్. సుకుమార్ అంటే… లెక్కల మాస్టారు. ఎవరి ట్రెండ్ వాళ్లది. అయితే వీళ్లిద్దరూ తమ ట్రాక్ పక్కన పెట్టి.. కొత్తగా ప్రయత్నిస్తున్న సినిమా `పుష్ష`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. అడవులు, అక్కడి వాతావరణం, మట్టి మనుషులు, ఆ రఫ్ నెస్ – ఇవన్నీ `పుష్ష`లోనూ దర్శనమివ్వబోతున్నాయి. అందుకు `పుష్ష` టీజరే సాక్ష్యం. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `పుష్ఫ`రాజ్ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ విడుదల చేశారు. 80 సెకన్ల పాటు సాగే ఈ టీజర్ లో సుకుమార్ తన యాక్షన్ తఢాకా చూపించాడు. బహుశా ఈ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు… సుకుమార్ ఎప్పుడూ చేయలేదేమో..? అడవులు, ఆ వాతావరణం, అక్కడ పుష్షరాజ్ ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం, ముసుగు ఉన్నా, పుష్షరాజ్ – శత్రువులతో తలపడే వైనం.. ఇవన్నీ సింప్లీ సూపర్బ్ గా తెరకెక్కించాడు సుకుమార్. `తగ్గేదే లే` అనే ఒకే ఒక్క డైలాగ్ ఈ టీజర్ లో వినిపించింది. నిజంగా ఏ విషయంలోనూ `పుష్ష` తగ్గేదే లేదన్న సంకేతాల్ని ఈ టీజర్ ద్వారా చెప్పకనే చెప్పేశాడు సుకుమార్, బన్నీ. ఆ ఫొటోగ్రఫీ, యాక్షన్ షాట్లూ, దేవిశ్రీ ఇచ్చిన ఆర్.ఆర్… ఈ టీజర్‌కి మంచి కిక్ జోడించాయి. మొత్తానికి పుష్ష ఓ డిఫరెంట్ సినిమా అవుతుందన్న భరోసా ఈ టీజర్ తో మరోసారి కలిగింది.