అల్లు అర్జున్ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరవనున్నారు. ఆయన లీగల్ టీం ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ పోలీసుల విచారణను తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సమస్యలు రెట్టింపు అవుతాయని చెప్పడానికి లాయర్లు అక్కర్లేదు. జరుగుతున్న పరిమామాలు చూస్తే చాలు. పోలీసుల ఎదుట హాజరై అసలు జరిగిందేమిటో మొత్తం చెబితే ఆయన పాత్ర పరిమితం అన్న విషయం వారికి క్లారిటీ వస్తుంది.
అల్లు అర్జున్ పై పోలీసులకు ప్రత్యేకమైన కోపం ఉండదు. ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. సంధ్యా ధియేటర్ వివాదంలో జరిగింది ప్రమాదమని అందరూ అంగీకరిస్తారు. కానీ ఓ నిండు ప్రాణం పోవడానికి, మరో చిన్న ప్రాణం కోమాలోకి ఉండటానికి కారణమైన వారిని మాత్రం చట్ట పరంగా శిక్షిస్తారు. ఆ నిర్లక్ష్యంఎవరిది అన్నది తేల్చేందుకే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు. ప్రాథమికంగా ధియేటర్ యాజమాన్యం తప్పు. అనుమతి లేదన్న విషయాన్ని అర్జున్ దాకా తీసుకెళ్లలేదు. ఆయన వస్తే బౌన్సర్లతో ఏర్పాటు చేసుకోవచ్చని అతిగా వ్యవహరించారు. వారి తీరు వల్లే ఇదంతా జరిగింది.
అల్లు అర్జున్ కు జరిగిందేమిటో తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం ఆయన కేంద్ర బిందువు కాబట్టి ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. విమర్శలు చేస్తున్నారు. కానీ చట్టం ముందు ఆయన ఏ 11 మాత్రమే. అందుకే అర్జున్ దీన్ని పెద్దది చేసుకోకుండా.. చట్టాన్ని పాటిస్తానని పోలీసులకు నమ్మకం కలిగిస్తే ఈ వివాదం ఇంతటితో ముగిసిపోవచ్చు.