కొన్ని సినిమా ఎనౌన్స్ మెంట్లు చాలా విచిత్రంగా వుంటాయి. కథ వుండదు, ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలీదు, ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ వుండదు. కానీ ప్రకటన మాత్రం వస్తుంది. హీరో, డైరెక్టర్, నిర్మాత ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి ప్రకటన వదిలేస్తారు. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా సినిమా ప్రకటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్.. ముగ్గురు కలసి ఓ ఫోటో దిగి కాంబినేషన్ లో సినిమా అన్నారు. ఈ ఫోటో తప్పితే ఈ కాంబినేషన్ పై మరో మాట లేదు. 2025లో ఈ సినిమా మొదలుపెడతారని అంటున్నారు. ఇదీ గాలి వార్తే. ముఖ్యంగా ఈ సినిమాకి కథ లేదు.
ఇప్పటివరకూ ఒకే ఒక్క సినిమా ‘అర్జున్ రెడ్డి’ తీశాడు సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడా హిట్టు కొట్టాడు. బాలీవుడ్ హిట్టుతో సందీప్ పై నిర్మాత భూషణ్ కుమార్ కి గురి ఏర్పడింది. దీంతో రన్ బీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా సెట్ చేశాడు. అదే సమయంలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని కూడా లాక్ చేయించారు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగులు జరుగుతున్నాయి.
పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ సంపాయించుకున్నాడు అల్లు అర్జున్. ఆయనతో కూడా ఒక సినిమా బుక్ చేసుకోవాలనేది భూషణ్ ఆలోచన. అల్లు అర్జున్ కి కూడా మంచి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో వుంది. భూషణ్, సందీప్ దీనికి మంచి ఆప్షన్ అని భావించి కాంబినేషన్ ని ప్రకటించారు. అంతే తప్పితే ఈ కాంబినేషన్ కథ ఇంకా సెట్ కాలేదు.
నిజానికి ఇలా కాంబినేషన్ లు ప్రకటించడం బన్నీకి కొత్త కాదు. గతంలో వేణు శ్రీరామ్ , దిల్ రాజు తో ప్రకటించిన ఐకాన్ సినిమా, కొరటాల తో అనౌన్స్ చేసిన సినిమా, లింగుస్వామితో ప్రకటించిన సినిమా.. ఏమయ్యాయో ఆతీగతి లేదు. ఇప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియని ఒక కాంబినేషన్ ప్రకటన వచ్చింది. హిట్లుపై నడిచే ఇండస్ట్రీ ఇది. యానిమల్, స్పిరిట్ సినిమాలు విజయాలు సాధిస్తే.. ఈ కాంబినేషన్ లైవ్ లో వుంటుంది. ఇందులో ఏది తేడా కొట్టినా.. బన్నీ మరో క్రేజీ కాంబినేషన్ ని చూసుకోవడం పెద్ద వింత కాదు.