నేనెప్పుడూ రికార్డులను పట్టించుకోను
వసూళ్లు ముఖ్యం కాదు
అభిమానుల చప్పట్లే ముఖ్యం
– ఇలాంటి స్టేట్మెంట్లు బాగానే ఇస్తుంటారు హీరోలు. కానీ వాళ్ల దృష్టెప్పుడూ రికార్డులపైనే ఉంటుంది. అభిమానులకు చూపించుకోవడానికి, మురిపించుకోవడానికి ఈ అంకెల్ని అస్త్రాలుగా వాడేస్తుంటారు. అందులో అల్లు అర్జున్ ముందు స్థానంలో ఉంటుంటాడు. బన్నీకి ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ అనే బిరుదు ఉంది. ఎందుకంటే… ట్విట్టర్లో తనకు ఫాలోవర్స్ ఎక్కువ. ట్విట్లర్లో మైల్ స్టోన్లను కూడా రికార్డులగా ప్రమోట్ చేసుకుంటుంటాడు. యూ ట్యూబ్ క్లిక్స్, హిట్స్ సంగతి సరేసరి. అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్‌కి బాగానే గిరాకీ ఉంటుంది. దానికి తగ్గట్టు… యూ ట్యూబ్ హిట్స్లను కూడా పరిగణలోనికి తీసుకుని.. ‘యూ ట్యూబ్ రికార్డుల్లో ఇండియాలో మా బన్నీనే టాపు’ అన్నట్టు బన్నీ పీఆర్లూ భలే పబ్లిసిటీ ఇస్తుంటారు.
తెలుగులో సూపర్ హిట్టయిన సరైనోడుని హిందీలో ‘దిల్వాలా’ పేరుతో డబ్ చేశారు. అది యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. 200 మిలియన్లు దాటేసింది. ఓ ఫుల్ లెంగ్త్ సినిమాకి (భాష ఏదైనా సరే) ఈ స్థాయిలో హిట్స్ రావడం ఇదే తొలిసారి. లైకులు, కామెంట్లలోనూ బన్నీ సినిమాదే రికార్డ్ అట. వంద రోజులు, వసూళ్ల రికార్డులు పోయి.. యూట్యూబ్ హిట్లూ, లైకులు, షేర్ల రికార్డులపై పడ్డారన్నమాట. యూ ట్యూబ్ హిట్స్‌పై ఎప్పటి నుంచో బోలెడన్ని అనుమానాలున్నాయి. అవన్నీ పెయిడ్ హిట్స్ అని చెబుతుంటారు. హీరోల టీజర్లు, ట్రైలర్లకు మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. అదీ ఒక్క రోజులోనే. నిజానికి ఆ స్థాయిలో హిట్స్ వచ్చాయంటే వెనుక గోల్ మాల్ జరిగే ఉంటుందన్నది ట్రేడ్ వర్గాల అనుమానం. హిట్స్ ఎక్కువగా చూపించడానికి కొన్ని సంస్థలు అదే పనిగా పని చేస్తుంటాయన్నది సినిమా వర్గాలకు మాత్రమే తెలిసిన రహస్యం. ఇది వరకు `డీజే` ట్రైలర్ కి వచ్చిన వ్యూస్లపై కూడా ఇలాంటి అనుమానాలే రేగాయి. యూ ట్యూబ్‌లో చిన్న చిన్న సినిమాలకే మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. యాక్షన్ డబ్బింగ్ సినిమాలకు అక్కడ గిరాకీ ఎక్కువ. అందుకే బన్నీ సినిమా అంత పాపులర్ అయ్యుంటుంది. మిగిలిన అన్ని సినిమాల్నీ క్రాస్ చేసి మన తెలుగు సినిమా నెంబర్ వన్‌గా నిలవడం గొప్పే. కాకపోతే…దాన్ని ఇంకా గొప్పగా బన్నీ పీఆర్ వర్గం ప్రమోట్ చేయడమే.. కాస్త అతిగా అనిపిస్తోంది. యూ ట్యూబ్ రికార్డుల్ని కూడా ఇలా పట్టించుకుంటూ పోతే… అభిమానులు కొట్టుకోవడానికీ, తిట్టుకోవడానికి మరో మార్గం చూపించినట్టే.