మీడియాకు మాత్రమే కాదు, బన్నీ దగ్గర పనిచేసే సిబ్బందికీ అర్థం కావడం లేదు. బన్నీ భయపడి మీడియా దగ్గరకు రావడం లేదా? మనకి ఎందుకొచ్చిన గొడవ అని దూరంగా ఉంటున్నాడా? అని! మంగళవారం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ప్రెస్ మీట్ జరిగింది. షూటింగ్ జరుగుతున్న చోటుకి మీడియాను పిలిచారు. రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల త్యాగాలను వర్ణిస్తూ సినిమాలో రాసిన పాటను జనవరి 25 సాయంత్రం విడుదల చేస్తున్నామని చెప్పడానికి. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాత లగడపాటి శ్రీధర్, పాట రాసిన రామజోగయ్య శాస్త్రి వచ్చారు. లొకేషన్లో ఉన్న బన్నీ గానీ, దర్శకుడు వక్కంతం వంశీ గానీ రాలేదు. ప్రెస్ మీట్ అంతా పూర్తయిన తర్వాత సరదాగా నాలుగు నవ్వులు నవ్వి వెళ్లారు.
సినిమాలో బన్నీ సైనికుడిగా నటిస్తున్నారు. అంత గొప్ప పాట పెట్టారు. సైనికుల గొప్పతనాన్ని వర్ణిస్తూ బన్నీ కూడా నాలుగు ముక్కలు చెబితే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు. కానీ, ఇటీవల బన్నీ మీడియా ముందుకు రావడం లేదు. ముఖం చాటేస్తున్నారు. ఆడియో వేడుకలు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ తప్ప చిన్నవాటికి, నేరుగా మీడియాతో ముఖాముఖీకి సుముఖత చూపడం లేదు. ‘చెప్పను బ్రదర్’ వివాదం నుంచి ఇంతే. ‘దువ్వాడ జగన్నాథమ్’ ఇంటర్వ్యూలనూ బందోబస్తు మధ్య ఇచ్చారు.
‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ విడుదల తేదీ విషయంలో సహ నిర్మాత ‘బన్నీ’ వాసు పట్టుదల మీదున్నారు. ఏప్రిల్ 27న విడుదల చేయాలని. అదే తేదీన మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, రజనీకాంత్ ‘2.0’లు ఖర్చీఫ్ వేశాయి. ముందు మేం వేసిన తర్వాత మీరు ఎలా ప్రకటిస్తారని ‘బన్నీ’ వాసు ఎప్పుడో గుస్సా అయ్యారు. ఒకవేళ ఆ టాపిక్ గురించి ప్రశ్నలు అడుగుతారని మీడియాను అవాయిడ్ చేస్తున్నారా? ఏం ప్రశ్నలు అడుగుతారో?! ఏం చెప్పాల్సి వస్తుందో?! ఇదంతా ఎందుకు?! అనే అభిప్రాయమా? ఇంకేమైనా ఉందా? బన్నీకి మాత్రమే తెలియాలి. ఏది ఏమైనా మంచి స్టార్ డమ్,క్రేజ్ ఉన్న యంగ్ హీరో మీడియాకి దూరంగా ఉండడం మంచి కాదేమో!