విజయ్ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ ఫంక్షన్ లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో సరదాగా ఒక డీల్ సెట్ చేసుకున్నాడు హీరో అల్లు అర్జున్.
విజయ్ దేవరకొండ సొంతంగా రౌడీ క్లబ్ అనే బ్రాండ్ తో ఒక దుస్తుల కంపెనీ కలిగి ఉన్నాడన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ మాట్లాడుతూ, వచ్చేసారి ఏదైనా ఫంక్షన్ కి తనను అతిధి గా పిలిచేట్టయితే, తనకు రౌడీ క్లబ్ బ్రాండ్ నుంచి ఒక మంచి డ్రస్ కూడా పంపవలసిందిగా కోరారు. దానికి ప్రతిఫలంగా తాను విజయ్ దేవరకొండ సినిమాలో ఒక పాట పాడుతానని నవ్వుతూ అన్నారు. దానికి విజయ్ దేవరకొండ కూడా తప్పకుండా అంటూ నవ్వుతూ అంగీకరించారు.
అయితే ఈ సరదా వ్యాఖ్యలతో పాటు, విజయ్ దేవరకొండ మీద పలు ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. విజయ్ తమ లాగా కాదని, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా వచ్చి తనకు తానుగా చెక్కుకున్న శిల్పం లాంటి వాడని, అలా సొంతంగా జీవితంలో పైకి వచ్చిన వారంటే తనకు ఎంతో గౌరవం అని అంటూ విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ స్టార్డం, ఇంత ఎక్కువ మంది అభిమానం పొందడానికి కారణం విజయ్ లో ఉన్న ఒరిజినాలిటీ అంటూ అల్లు అర్జున్ విజయ్ కి కితాబిచ్చాడు.