అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ రూపొందిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. బన్నీ `అల వైకుంఠపురములో` విడుదలైన తరవాత.. ఈ సినిమా షూటింగ్లో పాలు పంచుకోనున్నాడు. అయితే ఈలోగా కొన్ని సీన్స్‌ని గప్‌చుప్‌గా పూర్తి చేశాడట సుకుమార్. కేరళలోని దట్టమైన అడవుల మధ్య, ఓ జలపాతం నేపథ్యంలో ఓ సన్నివేశాన్ని రూపొందించాడట. బన్నీ లేకుండానే ఈ సీన్ పూర్తయ్యింది. బన్నీ పై బ్లూ మాట్లో షాట్ తీసి, దాన్ని సీజీ సహాయంతో కవర్ చేస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సన్నివేశానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించాడు. బాహుబలిలో జలపాతం సీన్ కి విపరీతమైన స్పందన వచ్చింది. తెలుగు సినిమాలో జలపాతం సీన్ అంటే.. బాహుబలిని గుర్తు తెచ్చుకుంటారు. ఆ రేంజులోనే ఈ సీన్‌ని తెరకెక్కించార్ట. బన్నీ ఇంట్రడక్షన్ సీన్ ఇదేనని తెలుస్తోంది. ఇది వరకే కథానాయకుడి చిన్నప్పటి ఎపిసోడ్లని కూడా సుకుమార్ పూర్తి చేసేశాడు. ఈ పాత్ర కోసం బన్నీ గెడ్డం పెంచబోతున్నాడు. బరువు కూడా పెరగాల్సివస్తుంది. అందుకోసం కొంత సమయం తీసుకుంటాడు. అయితే ఈలోగా బన్నీ అవసరం లేని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు సుకుమార్.