అల్లు అర్జున్ – అట్లీ కాంబోకి సంబంధించి ఇటీవలే ఓ అధికారిక ప్రకటన వచ్చింది. కాంబోని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతోందన్న విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేం చిత్రబృందం బయటపెట్టలేదు. కానీ ఈ సినిమాలో ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఎంచుకోవాలని చిత్రబృందం భావించిందని, అయితే ప్రియాంకా `నో` చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై బన్నీ సన్నిహితులు స్పందించారు. ప్రియాంక అసలు కథానాయికల ఆప్షన్లోనే లేదని, అసలు ఆమెని సంప్రదించలేదని, ఈ వార్తలన్నీ నిరాధారమైనవని తేల్చి చెప్పేశారు.
ప్రస్తుతం అట్లీ కథానాయిక వేటలోనే ఉన్నాడు. సమంత ఓ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఆమెని ఇంకా సంప్రదించలేదు కూడా. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో బన్నీ, సమంత జోడీగా కనిపించారు. ఆ తరవాత `పుష్ప`లో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. రెండూ హిట్లే. కాబట్టి ఈ హిట్ కాంబోని రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై కూడా చిత్రబృందం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. జూన్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు ఒకొక్కటిగా బయటకు రావొచ్చు.