టాప్ స్టార్లంతా యమ స్పీడుమీదున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్.. ఇలా ఎవరినైనా తీసుకోండి. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని సెట్ చేసుకుంటున్నారు. యేడాదికి ఒక్క సినిమానే చేసే మహేష్ కూడా స్పీడు పెంచి… రెండేళ్లకు కనీసం మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ సినిమా చేతిలో ఉండగానే వంశీ పైడిపల్లి కథని ఓకే చేశాడు. రామ్ చరణ్ కూడా అంతే. రంగస్థలం పనులు జరుగుతుండగానే బోయపాటి కథ ఓకే చేశాడు. రాజమౌళి సినిమా ఉండగానే ఉంది. ఇలా హీరోలంతా చక చక అడుగులు వేస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం మరీ నిదానంగా నడుస్తున్నాడు. ‘నా పేరు సూర్య’ తరవాత బన్నీ సినిమా ఏమిటి? ఎవరితో? అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు.
కొరటాల శివ లైన్లో ఉన్నా – తన నిర్ణయం మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టాడు. ఓ కొత్త దర్శకుడు కూడా బన్నీకి కథ చెప్పి.. తన అనుమతి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ‘భరత్ అనే నేను’ రిజల్ట్ చూశాక.. అప్పుడు కొరటాల సినిమా ఓకే చేయాలా, వద్దా? అనేది నిర్ణయించుకోవాలన్నది బన్నీ ఆలోచన. కొరటాల ట్రాక్ రికార్డ్ అంత బాగున్నా – బన్నీ ఎందుకో గుడ్డిగా రంగంలోకి దిగిపోవడానికి రెడీగా లేడు. ఎంత పెద్ద దర్శకుడైనా సరే – అన్ని రకాల ఆలోచించే అడుగు వేయాలన్నది బన్నీ మాట. ఆలోచనల వరకూ అది బాగానే ఉంటుంది. కానీ.. తదుపరి సినిమా ఎవరితో అనే క్లారిటీ వచ్చేస్తే… ఫోకస్ అంతా దానిపై పెట్టొచ్చు. క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ ఎక్కువైతే, ఆ తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. బన్నీతో సినిమా చేయడానికి కొరటాల రెడీగా ఉన్నాడు. అయితే బన్నీ మాత్రం.. తన నిర్ణయాన్ని బయటకు చెప్పడం లేదు. ఈలోగా కొరటాలకు మరో హీరో కనెక్ట్ అయితే మాత్రం… ఈ ప్రాజెక్టు చేయి దాటిపోతుంది. మళ్లీ కొరటాల లైన్లోకి రావాలంటే ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు. హీరోలంతా స్పీడు స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటే… ఈ ‘సరైనోడు’ మాత్రం మరీ ఇంత స్లో అయిపోయాడేంటో..?