బాహుబలి ప్రభాస్‌కి చేసిన మేలేంటంటే.. ప్రధానంగా చెప్పుకోవాల్సింది `పాన్ ఇండియా` ఇమేజ్. దేశం అంతా ప్రభాస్ గురించి మాట్లాడుకున్నారు.. ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇదే తరహా ఇమేజ్ కోసం అల్లు అర్జున్ కూడా ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే కేరళలో అతనికి అభిమానగణం ఉంది. తెలుగులో వచ్చిన తన సినిమాల్నీ హిందీలో డబ్బింగ్రూపంలో వెళ్తున్నాయి. థియేటర్లో ఆడకపోయినా.. యూ ట్యూబ్‌లో వాటికి మంచి హిట్స్ దక్కుతున్నాయి. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన దువ్వాడ జగన్నాథమ్ హిందీ వెర్షన్.. యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. అయితే ఇలాంటి ఫోకస్ ఇంకా ఇంకా పెంచాలన్నది బన్నీ ఆలోచన. దానికి `నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా`తో అంకురార్పణ చేయాలని బన్నీ భావిస్తున్నాడు.
ఈ సినిమాని వీలైనన్ని భాషల్లోకి అనువదిస్తే బాగుంటుందని బన్నీ అనుకుంటున్నాడట. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ ఇది. ఇలాంటి కథలు ఎక్కడి ప్రేక్షకులకైనా కనెక్ట్ అవుతాయి. బన్నీ సినిమా తెలుగుతో పాటు మలయాళంలోకి వెళ్లడం సర్వసాధారణం. దాంతో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేయాలని. అక్కడ వీలైనంత ప్రమోషన్ కల్పించాలని చూస్తున్నాడట. హిందీ వెర్షన్‌ని కేవలం యూ ట్యూబ్ లో పెట్టి వదిలేయడమే కాకుండా.. దానికంటూ ఓ ప్రచారం నిర్వహించాలని, థియేటర్లలోనూ సినిమా ఆడాలని బన్నీ భావిస్తున్నాడట. ఇందుకోసం ఓ స్పెషల్ టీమ్ పనిచేయబోతోందని తెలుస్తోంది. సో… `నా పేరు సూర్య` టార్గెట్ .. తెలుగులో భారీ వసూళ్లు అందుకోవడమే కాదు, మిగిలిన భాషల్లోనూ తనకంటూ ఓ కొత్త ఇమేజ్ సృష్టించుకోవడం. మరి ఈ ప్రయత్నం ఏ మేర సఫలీకృతం అవుతుందో.