సంక్రాంతి అనగానే.. కొత్త సినిమాల జాతర చూస్తుంటాం. ఈ యేడాది అదే జరిగింది. ఏకంగా 5 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల మధ్య గట్టి పోటీ ఎదురైంది. 2024 సంక్రాంతికీ హోరా హోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఎందుకంటే… వచ్చే సంక్రాంతికి అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి.
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఇటీవలే పట్టాలెక్కింది. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది. సరిగ్గా అదే సీజన్లో… రామ్ చరణ్ – శంకర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ గట్టిగా ఉంది. ప్రతీ యేడాదికీ సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుంటారాయన. మైత్రీకి కూడా సంక్రాంతి కలిసొచ్చింది. ఈ యేడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తే.. రెండూ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే 2024 సంక్రాంతికీ ఓ సినిమా లాక్ చేయాలని భావిస్తున్నారు. పుష్ప 2 అప్పటికి సిద్ధమైతే… బన్నీ, చరణ్ బాక్సాఫీసు పోరు చూసే అవకాశం ఉంటుంది.