‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ తరవాత అల్లు అర్జున్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అలాగని కమిట్మెంట్స్ లేవని కాదు. కొత్త కథలు వింటూనే ఉన్నాడు. విక్రమ్ కె.కుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ.. ఇలా టాప్ దర్శకులతో పనిచేయడానికి బన్నీ తగిన స్కెచ్చులు వేసుకున్నాడు. దాంతో పాటు ఇంకొన్ని కథలు విని అందులో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మారుతి, పరశురామ్… తన కాంపౌండ్ దర్శకులే. కాబట్టి వాళ్లతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. ఇప్పుడు మరింతమంది కొత్త దర్శకులు బన్నీకి కథలు చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఈమధ్య ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా బన్నీకి ఓ కథ వినిపించాడని తెలుస్తోంది. కథ బన్నీకి బాగా నచ్చిందని, కానీ నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదని సమాచారం. అంతే కాదు. ‘గరుడ వేగ’తో హిట్టు అందుకున్న ప్రవీణ్ సత్తారు కూడా బన్నీకి ఓ లైన్ చెప్పాడట. అయితే దీనిపైనా బన్నీ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బన్నీ మాంచి ఎంటర్ టైన్మెంట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడని, అది దొరికే వరకూ ఇలా కథలు వింటూనే ఉంటాడని బన్నీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంద్రగంటి, ప్రవీణ్ సత్తారు అయితే పక్కా క్లాసీగా ఉంటాయి. ఎంటర్టైనర్ కావాలనుకుంటే మాత్రం… మారుతి, పరశురామ్లైతే బెటర్. మరి బన్నీ మనసులో ఏముందో?