ప్రముఖ యువ కథానాయకుడు అల్లు అర్జున్ మామ (స్నేహారెడ్డి తండ్రి) శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారా? గులాబీ కండువా పక్కనపెట్టి, కారులోంచి దిగి… హస్తం గుర్తు చూపుతారా? అంటే… రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినబడుతోంది. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి శేఖర్‌రెడ్డి పోటీ చేసి ఓడారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలిచారు. ఎన్నికల అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ మామ శేఖర్‌రెడ్డికి మొండిచెయ్యి చూపినట్టు అయ్యింది. దాంతో ఆయనలో అసంతృప్తి చెలరేగిందని, కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామికవేత్తగా శేఖర్‌రెడ్డికి మంచి పేరుంది. రాజకీయ నాయకుడిగానూ పేరు తెచ్చుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు.