అల్లు అర్జున్ కుటుంబానికి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఏదీ కలసి రావడం లేదు. తమ కుటుంబానికి ఎదురవుతున్న పరిస్థితుల్ని వివరించడానికి కాంగ్రె్స నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షితో సమవేశం అయ్యేందుకు ప్రయత్నించారు. ఆయన వచ్చినప్పుడు మీడియా కూడా ఉండటంతో ఆమె ఏమీ మాట్లాడకుండానే పంపించేశారు. తమ బాధ ఏదో చెప్పుకుందామని అనుకున్న ఆయనకు ఆ అవకాశం కూడా లభించలేదు.
చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని చెబుతున్నారు. వేం నరేందర్ రెడ్డితో ఈ అంశంపై మాట్లాడారని.. ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నానని ఆయన చెప్పారని అంటున్నారు. అయితే ప్రస్తుతం కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంతా చక్కబడుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పట్టువదలని చంద్రశేఖర్ రెడ్డి దీపాదాస్ మున్షి ద్వారా ప్రయత్నించాలని అనుకున్నారు. కానీ అక్కడ ఆమె గోడు వినలేదు.
అల్లు అర్జున్ మామను పట్టించుకోలేదని.. వచ్చిన వార్తలపై పీసీసీ చీఫ్ స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డికి.. దీపాదాస్ మున్షితో పెద్దగా పరిచయం లేదన్నారు. తనకు చంద్రశేఖర్ రెడ్డి మిత్రుడని.. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై మాట్లాడేందుకు వెళదామని చెప్పానన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన రోజున ఆయన కాంగ్రెస్ పై.. రేవంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరిగింది.