తమిళంలో హిట్టయిన గజినిని తెలుగులో డబ్ చేసి, హిందీలో రీమేక్ చేసి భారీ లాభాలు ఆర్జించారు అల్లు అరవింద్. అప్పట్లో రూ.100 కోట్లు సాధించిన సినిమాగా గజిని చరిత్ర సృష్టించింది. ఆ తరవాత వంద కోట్లు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే లెక్క రూ.1000 కోట్ల నుంచి మొదలవుతుంది. ‘గజిని’ తరవాత బాలీవుడ్ లో మరో సినిమా చేయలేకపోయింది గీతా ఆర్ట్స్. అయితే ఇప్పుడు ‘గజిని 2’ కోసం కర్చీఫ్ వేసేశారు అల్లు అరవింద్.
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా రూపొందిన ‘తండేల్’ ప్రమోషన్స్ ముంబైలో జరిగాయి. హిందీ ట్రైలర్ లాంచ్ కి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా గజినీ రోజుల్ని గుర్తు చేశారు అరవింద్. అప్పట్లోనే ఈ సినిమా వంద కోట్లు కొడుతుందని అమీర్ జోస్యం చెప్పారని, అదే నిజమైందని, ఈసారి అమీర్ తో వెయ్యి కోట్ల సినిమా తీస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గజిని 2ని అమీర్‌తో రూపొందించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ‘గజిని 2’ అనేది మంచి ఐడియానే. ఈ కథకు ఆ స్కోప్ ఉంది. మురుగదాస్ కూడా ఇది వరకే గజిని 2కి సంబంధించిన లైన్ ఒకటి సిద్ధం చేశాడు. గీతా ఆర్ట్స్‌లో మురుగదాస్ తో ఓ సినిమా చేయాల్సివుంది. అది.. ఇలా వర్కవుట్ అయినా ఆశ్చర్యం లేదు. అమీర్‌ఖాన్ ఈమధ్య వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశ పడుతున్నాడు. గజిని 2 స్క్రిప్టు అమీర్ కి నచ్చితే… అరవింద్ కల నెరవేరినట్టే.