గత కొన్ని రోజులుగా సాగుతున్న సెగ `నా పేరు సూర్య` సినిమాపై పడనుందా? ఈ సినిమాపై కొన్ని వర్గాలు, మీడియా శక్తులు కక్ష కట్టే ప్రమాదం ఉందా? ఆ అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు అల్లు అరవింద్. నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్లో అరవింద్ మాటలు… కలకలం రేపాయి. ”ఇండ్రస్ట్రీలో సాగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఈ సినిమాపై కక్ష కట్టే అవకాశాలున్నాయి. పనిగట్టుకుని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమర్శకులు చేస్తారు. ఈ వేదిక వెనుక ఓ విషయం జరిగింది. అది తరవాత చెబుతాను” అని ఆవేశంగా మాట్లాడారు. దాంతో నా పేరు సూర్య ఆడియో వేడుక జరుగుతున్న స్టేజీ వెనుక ఏం జరిగింది? మీడియాలో ఎవరు `సూర్య`కి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు? అనే అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మెగా కుటుంబానికీ కొన్ని మీడియా సంస్థలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల యాడ్లు కొన్ని టీవీ ఛానళ్లకు ఇవ్వకూడదని మెగా హీరోలు నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి స్టేజీ వెనుక ఏం జరిగిందో అరవింద్ చెబుతారా? ఆయన అనుమానాలు ఎవరిపైన? ఇవన్నీ ‘సూర్య’ ఆడియో వేడుక మిగిల్చిన ప్రశ్నలే.