సినిమాలు ఆపేస్తే కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నారని రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో పవన్ కల్యాణ్ ఆవేశపడ్డారు. అయన అనుకున్నదే నిజం అయింది. ఎవరో కాదు స్వయంగా అల్లు అరవింద్ .. సీఎం జగన్ను కాపాడాలని వేడుకున్నారు. మీ మీదే ఆదారపడి ఉన్నామని.. దయ తలచాలని విజ్ఞప్తి చేశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎదురుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కాళ్లపై పడిపోతారేమో అన్నంత దీనంగా మాట్లాడారు. మీ మీదే ఆధారపడి ఉన్నామని చెప్పుకొచ్చారు.
సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని.. పరిశ్రమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించినట్లే సినిమా పరిశ్రమనూ రక్షించాలని కోరారు. కొత్తగా విడుదలయ్యే సినిమాలు మీపైనే ఆధారపడి ఉన్నాయని నిర్మోహమాటంగా చెప్పారు. పరిశ్రమ మనుగడ సాగించాలంటే మీ సహకారం ఎంతో అవసరమని..రాజు తల్చుకుంటే.. వరాలకు కొదవా అనికూడా చెప్పుకొచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే రూపొందుతోంది.
అల్లు అరవింద్ ఒక్క సారిగా ఏపీ ప్రభుత్వానికి ఇలా లొంగిపోయినట్లుగా ప్రకటనలు చేయడం మెగా ఫ్యాన్స్ ను సైతం విస్మయానికి గురి చేసింది. ఓ వైపు పవన్ కల్యాణ్ తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతూంటే.. దయతల్చాలంటూ అరవింద్ బతిమాలుకోవడం పరిస్థితిని సీరియస్గా మారుస్తోంది.