అల్లువారి అబ్బాయి శిరీష్ హీరోగా మళయాల రీమేక్ తలకెత్తుకున్నారు నిర్మాత మధుర శ్రీధర్. ఆ సినిమా దాదాపు పూర్తయింది. కానీ సినిమా విడుదల మాత్రం ఇప్పట్లో వుంటుందా? అన్నది అనుమానం. ఇప్పటికే ఈ సినిమాను గీతా కాంపౌండ్ స్కాన్ చేయడం పూర్తయింది. ఆ మేరకు రిపేర్లు జరుగుతున్నాయని టాక్. ఇంకా గీతా అరవింద్ గారి ఫైనల్ స్కాన్ మాత్రం మిగిలే వుంది.
వాస్తవానికి ఈ సినిమాను మార్చి ఫస్ట్ అన్నారు. మూడోవారం అన్నారు. కానీ ఇప్పడు విడుదల ఎప్పుడో తెలియదంటూ టాక్ వినిపిస్తోంది. సినిమాను రకరకాలుగా వెర్షన్లు తయారుచేసి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అంతా అయ్యాక ఓ వెర్షన్ పూర్తయ్యాక, అప్పుడు అల్లు అరవింద్ ఎంటర్ అవుతారు సీన్లోకి. ఆయన చెప్పిన మార్పులు చేర్పులు జరిగాక, అప్పుడు డేట్ కోసం వెదుకుతారు.
మే ఫస్ట్ డేట్ ఖాళీగా వుంది. దాన్ని బుక్ చేసుకోవాలన్న ఆలోచనలు అయితే వున్నాయి. కానీ సినిమాను సమర్పించే నిర్మాత సురేష్ బాబు కూడా ఓకె అనాల్సి వుంది. ఇటు హీరో ఫాదర్ పెద్ద డిస్ట్రిబ్యూటర్, అటు సమర్పకుడు కూడా డిస్ట్రిబ్యూటర్, ఇద్దరి దగ్గర పాస్ అయిన తరువాత కానీ డేట్ దాకా రాదు. అంత వరకు ఎబిసిడి లు దిద్దుతూనే వుండాల్సిందే.