అల్లు శిరీష్ సినిమా అంటే చాలు… గీతా ఆర్ట్స్ కాంపౌండ్ జనాలందరూ ఓ రేంజ్ హడావుడి చేస్తారు. చినబాబు సినిమా కథకు బీజం పడినప్పటి నుంచి థియేటర్ల నుంచి బొమ్మ బయటకు వచ్చేవరకూ పబ్లిసిటీ పీక్స్‌లో వుండేలా ప్లాన్ చేస్తారు. అదేంటో మరి.. ఈ రోజు ‘ఎబిసిడి’ సినిమాను సైలెంట్‌గా స్టార్ట్ చేశారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అనే సినిమా చేశాడు. కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమా హిట్టయ్యింది. ఇప్పుడదే సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో అల్లు శిరీష్ రీమేక్ చేస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ ఫిలింనగర్ టెంపుల్లో సినిమా ఓపెనింగ్ సైలెంట్‌గా జరిగింది. మొన్నటివరకూ సినిమాకి కన్నడ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడు, సినిమాలో హీరో ఫ్రెండ్‌గా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ నటిస్తున్నాడు అంటూ హడావుడి చేశారు. మరి, ఓపెనింగ్ సైలెంట్‌గా ఎందుకు చేశారో మరి? అన్నట్టు.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే మొదలు పెడుతున్నారు. ఇందులో నాని ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్.