మెగా వృక్షానికి మూలం.. చిరంజీవి. ఆ కుటుంబం నుంచి ఎంత మంది హీరోలొచ్చినా వాళ్లందరికీ స్ఫూర్తి చిరు నుంచే లభిస్తుంది. పవన్ నుంచి సాయిధరమ్ తేజ్ వరకూ అందరూ ఆ మాటే చెప్పారు. ఇప్పుడు అల్లు శిరీష్ కూడా అదే అంటున్నాడు. చిరు మావయ్య నుంచి మూడు కీలకమైన విషయాలు నేర్చుకొన్నా. అదే నా జీవితాన్ని మార్చేశాయి అంటున్నాడు శిరీష్. తను కథానాయకుడిగా నటించిన శ్రీరస్తు – శుభమస్తు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిరుపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు శిరీష్.
కుటుంబం పట్ల ఎంత బాధ్యతతో మెలగాలో చిరు నుంచే నేర్చుకొన్నాడట శిరీష్. చిన్నప్పుడు తనని ప్రేమగా చూసుకొన్నాడట. బాగా లావుగా ఉన్న తనని జిమ్‌కి పంపిచింది చిరునేనట. ఇవన్నీ ఓసారి గుర్తు చేసుకొన్నాడు. ఫ్యాన్స్‌తో ఎలా మెలగాలో కూడా చిరునే నేర్పించారట.
అంతేకాదు.. చుట్టుపక్కల వాళ్లెవరైనా మంచి పని చేస్తే.. మెచ్చుకోమని సలహా ఇచ్చారట. ఈ మూడు విషయాలూ మెగాస్టార్నుంచే నేర్చుకొన్నానని, అవి తనలో చాలా మార్పుని తీసుకొచ్చాయని శిరీష్ చెబుతున్నాడు. తన ఫంక్షన్కెప్పుడూ చిరు మావయ్య రాలేదని, ఆ లోటు తీర్చడానికే ఈ కార్యక్రమానికి ఆహ్వానించానని శిరీష్ అంటున్నాడు. సో చిరు వచ్చాడు.. దీవెనలు అందించాడు. ఇక ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.