విడుదలై రెండు వారాలు కావొస్తున్నా… గీత గోవిందం టాపిక్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ సినిమా గురించి ఇంకా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా ‘గీత గోవిందం’ని అభివర్ఱిస్తున్నారు విశ్లేషకులు. ఈ సినిమా అందరిలోనూ ఆనందాన్నీ, సంతోషాన్నీ మిగిల్చింది. అయితే అల్లు శిరీష్ మాత్రం ఈ సినిమా గుర్తొచ్చినప్పుడల్లా ఏదో వెలితిగా భావిస్తున్నాడట. దానికి కారణం.. `గీత గోవిందం` స్క్రిప్టు తను చేయాలనుకున్నాడట. ‘శ్రీరస్తు శుభమస్తు’ తరవాత గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు పరశురామ్. ఆ సమయంలోనే ‘గీత గోవిందం’ స్క్రిప్టు పుట్టింది. కథా చర్చల్లో భాగంగా ‘ఈ సినిమా నేను చేస్తా’ అని శిరీష్ ముందుకొచ్చాడట. ఈ కథపై నమ్మకంతో బన్నీ వాసు, అరవింద్ కూడా ‘దీన్ని శిరీష్‌తో చేసేద్దాం’ అన్నార్ట. కానీ… పరశురామ్ మాత్రం ‘నాకు మరో హీరో కావాలి..’ అని గట్టిగా చెప్పాడట. ‘కామెడీ టైమింగ్ బాగా తెలిసున్న కథానాయకుడు కావాలి.. అప్పుడే ఈ కథ వర్కవుట్ అవుతుంది’ అని పట్టుపట్టి కూర్చున్నాడట. శిరీష్, అల్లు అరవింద్ ఎన్నిసార్లు అడిగినా పరశురామ్ ఇదే మాట చెప్పడంతో.. అప్పుడు ఈ కథ విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. శిరీష్ చేస్తే ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హైప్, ఈ స్థాయి ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. విజయ్ దేవరకొండ చేయడం కూడా గీతా ఆర్ట్స్‌కి మంచిదే అయ్యింది. వారసుడికి ఓ విజయం చేజారి ఉండొచ్చు.. కానీ సంస్థకు ఈ స్థాయిలో లాభాలు మాత్రం వచ్చి ఉండేవి కావు. అలా.. పరశురామ్ నిర్ణయంతో గీతా ఆర్ట్స్‌కి లాభమే జరిగింది తప్ప.. నష్టం జరగలేదు. కాకపోతే… ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా.. ‘అరె.. నేను చేసుండాల్సిందే..’ అంటూ శిరీష్ కాస్త చిన్నబోతున్నాడట. అంతే తేడా.