బ్రహ్మోత్సవం తరవాత శ్రీకాంత్ అడ్డాల మరి కనిపించలేదు. అసలే శ్రీకాంత్ చాలా లేట్. పైగా డిజాస్టర్ సినిమా తీసిన మూడ్‌లో ఉన్నాడు. అందుకే.. తదుపరి సినిమా కోసం చాలా టైమ్ తీసుకుంటున్నాడు. ఓ కథ సిద్ధం చేసి, ఆసక్తికరమైన టైటిల్ పెట్టాడు. అదే.. `కూచిపూడి వారి వీధి`. గీతా ఆర్ట్స్ ఈ కథని ఓకే చేసింది. కాకపోతే హీరోనే దొరకడం లేదు. శర్వానంద్‌తో ఈసినిమా చేయాలని అల్లు అరవింద్ భావించినా వర్కవుట్ అవ్వలేదు. పెద్ద హీరోలకెవరికీ నప్పని కథ ఇది. శర్వా, నాని, వరుణ్ తేజ్.. ఈ హీరోలకు సరిపోతుంది. కానీ.. వాళ్లంతా బిజీ.
`నాకు పెద్ద హీరోలొద్దు.. కొత్త హీరోలతోనైనా ఈ సినిమా చేస్తా` అంటున్నాడట శ్రీకాంత్ అడ్డాల. మరీ కొత్త వాళ్లతో ప్రయోగాలు చేయడానికి గీతా ఆర్ట్స్ సిద్దంగా లేదు. అన్నీ కుదిరితే గనుక.. అల్లు శిరీష్ తోనే ఈ సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నార్ట. శ్రీవిష్ణు లాంటి యువ కథానాయకుల పేర్లు కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. అయితే శ్రీవిష్ణు అయితే.. ఓపెనింగ్స్ డల్‌గా ఉంటాయేమో అన్నది గీతా ఆర్ట్స్ భయం. శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే దాదాపు ప్రయోగాత్మకమే. ఆడితే ఆడుతుంది, లేదంటే లేదు. మరో హీరోతో ఆ ప్రయోగాలు చేయడం ఎందుకు అనుకుంటే.. శిరీష్ తో ఈ సినిమా లాగించేయొచ్చు. త్వరలో రాబోతున్న `ఏబీసీడీ` వర్కవుట్ అయితే… శ్రీకాంత్ అడ్డాలకూ కాస్త ధైర్యం వస్తుంది. అందుకే ఏబీసీడీ రిలీజ్ అయ్యాకే… హీరో విషయంలో ఓ నిర్ణయానికి రావాలని గీతా ఆర్ట్స్ భావిస్తోంది. అప్పటి వరకూ శ్రీకాంత్ అడ్డాల కూడా ఓపిక పట్టాల్సిందే.