కొత్త జంట తరవాత సినిమా మొదలెట్టడానికి బాగా టైమ్ తీసుకొన్నాడు అల్లు శిరీష్. అయితే అంత గ్యాప్ భవిష్యత్తులో రాకూడదని గట్టిగా ఫిక్సయినట్టున్నాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. శ్రీరస్తు – శుభమస్తు షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాల్ని పట్టాలెక్కించాడు. అందులో ఓ చిత్రానికి ఎంవీఎన్ రెడ్డి దర్శకుడు. శైలేంద్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాథతో ఆకట్టుకొన్న మెహరీన్ కథానాయిక. ఇదో చారిత్రక నేథప్యమున్న ప్రేమకథ. మగధీరలా గతజన్మల నేపథ్యంలో సాగుతుందట. ఈ చిత్రానికి ‘జగదేకవీరుడి కథ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. అంటే.. సినిమా కాస్త జానపద టైపులో సాగుతుందన్నమాట. టైటిల్ బాగానే ఉంది గానీ… అల్లు వారి అబ్బాయి జగదేక వీరుడులా పోజు కొడుతూ కాంతారావు టైపులో కత్తియుద్దాలు చేస్తేనే కాస్త కామెడీగా ఉంటుందని అప్పుడే సెటైర్లు వేసుకొంటున్నారు సినీ జనాలు. శ్రీరస్తు శుభమస్తు విడుదల తరవాత…. తన దృష్టిని ఈ సినిమాపైనే కేంద్రీకరించనున్నాడు శిరీష్. ఈ యేడాది చివరికల్లా షూటింగ్ కూడా పూర్తవుతుందట. 2017 ప్రధమార్థంలో ఈ చిత్రం విడుదల కానుంది.