`గో లోకల్ – బీ వోకల్` అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నాడు అల్లు శిరీష్. స్వదేశీ వస్తువుల్ని కొందాం… వాటిని ప్రచారం చేద్దామన్నది శిరీష్ చెబుతున్న మాట. మనలో చాలామందికి ఫారెన్ గూడ్స్ అంటే మక్కువ ఎక్కువ. నాణ్యంగా ఉంటాయన్న నమ్మం. ఫారెన్ గూడ్స్ కొన్నాక గర్వంగా చెప్పుకుంటాం కూడా. కానీ.. ఫారెన్ వస్తువులు కొనడం వల్ల, ఆ దేశంలోని కంపెనీలు బాగుపడతాయి. అదే.. మన దేశంలో తయారైన వస్తువులు కొంటే, ఇక్కడి కంపెనీలు వృద్ధిలోకి వస్తాయి. దాని వల్ల.. ఉపాధి పెరుగుతుంది. ఆర్థికంగా దేశం పరిపుష్టం అవుతుంది. ఇదీ… ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగా 12 మంది సెలబ్రెటీలకు అల్లు శిరీష్ కొన్ని గిఫ్ట్ ప్యాక్లను పంపాడు. అందులో ఉన్నవన్నీ స్వదేశీ వస్తువులే. ఈరకంగా… ఆయా వస్తువులకు కాస్త ప్రచారం కల్పిస్తున్నాడు. ఈ ఆలోచన శిరీష్ కి ఎలా వచ్చింది? తన భవిష్య ప్రణాళికలేంటి?
“నిజానికి ఇది నా ఆలోచన కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతంలో ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి నిర్వహించారు. ఈ ఐడియా నాకు నచ్చింది. భారతీయ వస్తువులు కొంటే. మన దేశానికి పరోక్షంగా సేవ చేసినవాళ్లవుతాం అనిపించింది. అందుకే.. ఈ క్యాంపెయిన్ని నేను ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నా. విదేశీ వస్తువుల్ని శాశ్వతంగా బహిష్కరించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కానీ వీలైనంత వరకూ స్వదేశీ వస్తువుల్ని కొందాం. వాటినిక ప్రచారంలోకి తీసుకొద్దాం. మనలో చాలామంది స్వదేశీ వస్తువులు కొంటున్నా, బయటకు చెప్పుకోవడం లేదు. ఆ పద్ధతి మారాలి. 12 మంది సెలబ్రెటీలను ఎంపిక చేసి వాళ్లకు మన స్వదేశీ వస్తువుల్ని కొన్ని పంపాను. అవన్నీ వాళ్లకు బాగా నచ్చాయి. `ఇవి ఎక్కడ కొన్నావ్? రేటెంత` అని ఆసక్తిగా అడుగుతున్నారు. నాణ్యత పరంగా విదేశీ వస్తువులకు ధీటుగా మన దగ్గరా క్వాలిటీ ప్రొడెక్ట్ తయారవుతోంది. ధర కూడా తక్కువే. వాటిని గుర్తించి ప్రోత్సహిద్దాం. బజాజ్, డాబర్ వంటి బ్రాండ్ ల జోలికి నేను వెళ్లడం లేదు. ఎందుకంటే వాటికి రావల్సిన పేరు ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న చిన్న బ్రాండ్లను కూడా ప్రోత్సహిద్దాం. అలాగని నేనేం విదేశీ వస్తువుకో, చైనా ప్రొడక్ట్స్ కో వ్యతిరేకం కాదు. ఈ క్యాంపెయిన్ ని జనంలోకి తీసుకెళ్దామన్న ఆలోచన ఉంది. అందుకోసం రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నా” అని చెప్పుకొచ్చాడు శిరీష్.