ఒక్క క్షణం సినిమాపై కాపీ మరక పడుతోంది. ఈ సినిమా కొరియన్ మూవీ `ప్యారలల్ లైఫ్`కి కాపీ అని, ఆ సినిమా రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న అనిల్ సుంకర వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ మాత్రం.. ”మా సినిమా కాపీ కాదు… ఇదో కొత్త కథ..” అంటూ కవర్ చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి ‘ఒక్క క్షణం’ అనేది కొరియన్ సినిమాకి కాపీనే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే విషయం అర్థమవుతుంది. ఈ విషయంపై ఇది వరకే అనిల్ సుంకర ‘ఒక్క క్షణం’ బృందాన్ని నిలదీయడం జరిగిందని టాక్. ”కూర్చుని మాట్లాడుకొందాం… సమస్యని పరిష్కరించుకుందాం” అనుకున్నారు. కానీ ఆ సిట్టింగ్స్ విఫలం అవ్వడంతో.. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించడానికి రంగం సిద్ధం చేశాడు అనిల్ సుకంర. ఈ రోజు.. ‘ఒక్క క్షణం’ నిర్మాతలకు కోర్టు నోటీసులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబరు 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ సుంకరతో ఈ సమస్యని పరిష్కరించుకోకుంటే.. వచ్చేవారం ‘ఒక్క క్షణం’ విడుదల అవ్వడం కష్టమే.