అల్లు శిరీష్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు ‘బడ్డీ’ అనే సినిమాతో వస్తున్నాడు. శాం ఆంటోన్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. అజ్మల్ కీలక పాత్రధారి. జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
”చరిత్రలో ఇప్పటి వరకూ ఎప్పుడు అన్యాయం జరిగినా ఎదురుతిరిగిన సింహాన్ని, పులిని, చిరుతని చూసుంటారు. అన్యాయంపై తిరగబడిన ఓ టెడ్డీబేర్‌ని చూశారా..” అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. దాన్ని బట్టే ఈ కథేమిటో అర్థం చేసుకోవొచ్చు. ట్రైలర్ లో డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉన్నా, అన్యాయంపై పులులు, సింహాలూ, చిరుతలు తిరగబడడం ఏమిటో అర్థం కాదు. రైమింగ్ కోసం వాడేశారేమో?
ఈకథలో శిరీష్ పైలెట్‌గా కనిపించనున్నాడు. తనకూ టెడ్డీబేర్కీ సంబంధం ఏమిటి? అసలు టెడ్డీబేర్‌కి జరిగిన అన్యాయం ఏమిటి? అనేది ఈ కథలో ఆసక్తికరం. యాక్షన్ ఘట్టాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్‌కీ పెద్ద పీట వేసినట్టు అర్థం అవుతోంది. టెడ్డీబేర్ కథ కాబట్టి, చిన్న పిల్లలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. కో పైలెట్ గా అలీ నటించాడు. తనతో ఫైట్లూ చేయించారు. ఈమధ్య అలీ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తన కామెడీ కూడా వర్కవుట్ కావడం లేదు. మరి ఈసారేంచేస్తాడో చూడాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి. మరి… ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.