ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ‘అల్లుడు అదుర్స్’ ఒకటి. జనవరి 15న విడుదల అవుతోంది. ‘రాక్షసుడు’ లాంటి డీసెంట్ హిట్ తరవాత.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా ఇది. ‘రాక్షసుడు’లో తనదైన యాక్షన్, కామెడీ, డాన్సులకు చోటు లేకుండా పోయింది. అందుకే ఈ సారి.. అవన్నీ ఉండేలా జాగ్రత్త పడుతూ `అల్లుడు అదుర్స్` చేశాడు. ఈ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
టైటిల్ కి తగ్గట్టే.. యాక్షన్, కామెడీ దట్టంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు సంతోష్ శ్రీనివాస్. తనకు కమర్షియల్ మీటర్ బాగా తెలుసు. ఆ మీటర్ లోనే ఈ అల్లుడునీ నడిపించినట్టు అర్థం అవుతోంది. 2 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఇది. ఈ రెండు నిమిషాల్లోనూ.. అల్లుడు క్యారెక్టర్ ని చూపించడానికే వాడుకున్నాడు.
కొన్ని అనివార్యమైన కారణాల వల్ల లవ్ అంటే నాన్సెస్ అని ఫీలయ్యే అబ్బాయి.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది సినిమా “ఒక్కసారి నాదీ అనుకుంటే దాని కోసం ప్రాణం ఇస్తా.. జాన్ దేదూంగా..” అంటూ ఒక్క మాటలో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ప్రయత్నం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం ఈ సినిమాకి రిచ్ నెస్ అద్దాయి. ఇందులో సోనూసూద్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ కి కొత్తగా ఏర్పడిన పాజిటీవ్ ఇమేజ్ నేపథ్యంలో ట్రైలర్లో ఆ పాత్రని హైలెట్ చేస్తారేమో అనుకున్నారంతా. కానీ… సోనూసూద్ పాత్రని సైతం దాచేశారు. విలన్ ఇంట్లో హీరో దూరి కామెడీ చేసే.. ఫార్ములా ఈ సినిమాలోనూ వాడుకున్నారనిపిస్తోంది. దానికి తోడు హీరో అపరిచితుడిలా మారి.. చంద్రముఖి అవతారం ఎత్తి, దెయ్యంలా భయపెట్టడం, గొంతులు మార్చడం… ట్రైలర్లో చూపించారు. ఇవన్నీ కామెడీ సీన్లు అనుకోవాలి. బెల్లంకొండ సినిమా అనగానే యాక్షన్ దట్టిస్తారు. ఈ సినిమాలోనూ కావల్సినంత యాక్షన్ ఉంది.
“శీనుగాడు నా ఫ్రెండు.. యాక్షన్ సీక్వెన్స్‌లో వాడిది సెపరేట్ ట్రెండు.. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవమ్మా..” అంటూ వెన్నెల కిషోర్ తో… మహేష్ బాబు డైలాగ్ ని పేరడీ చేయించారు.
“మొదటి దెబ్బ మనం కొట్ట కూడదు.. ఒక వేళ కొడితే.. రెండో దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉండకూడదు..” అంటూ… యాక్షన్ సీన్లకు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. మొత్తానికి ఈ సంక్రాంతికి అల్లుడు బాగానే ఎంటర్టైన్ చేస్తాడన్న నమ్మకం కలిగించింది. థియేటర్లో ఈ అల్లుడి ప్రతాపం ఎలా ఉంటుందో చూడాలి.