Alluri Movie Telugu Review
పోలీస్ కథల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి జనం కనెక్ట్ అయితే.. తెరపై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ కథలతో సైతం.. మెస్మరైజ్ చేయొచ్చు. అందుకే హీరోలంతా పోలీస్ అవతారాలు ధరించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈమధ్య యువ హీరోలు సైతం ఖాకీ కట్టాలని తాపత్రయపడుతున్నారు. మొన్న రామ్ `వారియర్`లో చేసిందదే. ఇప్పుడు శ్రీవిష్ఱు వంతు వచ్చింది.
`ఈ కథ కోసం ఐదేళ్లు ఆగా..`
`నిజాయతీగా చేసిన ప్రతయ్నం ఇది`
`ఈ సినిమా నా మనసుకు బాగా దగ్గరైంది`
అంటూ ప్రమోషన్లలో శ్రీవిష్ణు ఊదగొట్టేశాడు. తన కాన్ఫిడెన్స్ చూసి, జనాలు సైతం శ్రీవిష్ణు ఈసారి ఇరగ్గొడతాడులే.. అని ఆశలు, అంచనాలు పెంచుకొన్నారు. మరి శ్రీవిష్ణు మాటలకూ, ఈ సినిమాకూ పొంతన ఉందా..?
అల్లూరిని కథగా చెప్పలేం. ఎందుకంటే ఇందులో కథే ఉండదు. కొన్ని సంఘటనలు తప్ప. అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ఱు) ప్రయాణమే ఈ కథ. తను ఫస్ట్ పోస్టింగ్ దగ్గర్నుంచి.. చివరి వరకూ ఏం జరిగిందన్నది ఎపిసోడ్లుగా చూపిస్తుంటారు. ప్రతీ బదిలీకీ ఓ కథ. ప్రతీ పోలీస్స్టేషన్లోనూ ఓ కేసు. దాన్ని ఈ అల్లూరి ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్లాడో తెరపై చూడాలి.
శ్రీవిష్ణు ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళంలో. అక్కడ ఎంట్రీ ఇవ్వడంతోనే దొంగల్ని పట్టుకొని బంగారం, డబ్బు రికవరీ చేస్తాడు. అది ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో శ్రీవిష్ఱు ఎంత నిజాయతీ పరుడో చూపిస్తారు. అక్కడే ఓ ఇంట్రో సాంగ్. కట్ చేస్తే.. అల్లూరిని అన్నల తాకిడి ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు. అక్కడ అన్నల్ని ఎలా దారిలోకి తెచ్చాడో ఓసీన్. ఇలా… ఈ సినిమా పార్టు పార్టులుగా ఉంటుంది. ఒకే కథగా సాగదు. హిట్టయిన ప్రతీ పోలీస్ కథలో ఉండే నీతీ, నిజాయతీ ఫార్ములా, ఆవేశ పూరితమైన డైలాగులు… ఇవన్నీ అల్లూరిలో అడుగడుగునా కనిపిస్తుంటాయి. అయితే ఆయా సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం, చాన్నాళ్ల నుంచీ, ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాల్లానే అనిపించడం ఇబ్బంది పెడుతుంది. ఏ సీన్ చూసినా.. దానికి ఎన్నో రిఫరెన్సులు కనిపిస్తాయి. మధ్యలో కాసేపు థియేటర్ నుంచి బయటకు వెళ్లి లోపలకు వచ్చినా – కథేం అయిపోయిందో అనే బెంగ లేదు. ఎందుకంటే క్రైమ్ పెట్రోల్ సిరీస్‌లా… ఇవన్నీ ముక్క ముక్కలుగా సాగిపోయే సీన్లే. ఇంట్రవెల్ ఎపిసోడ్ మాత్రం మంచి ఎమోషనల్ ఫైట్ తో సాగుతుంది. ఈ ఎపిసోడ్లో దుష్ట శిక్షణ చేసిన అల్లూరిని చూడొచ్చు. అమ్మాయికి తీరని అన్యాయం జరిగితే.. హీరో ఎలా తిరగబడ్డాడన్నది ఆసీన్. ఇలాంటి సీన్లు రొటీనే కావొచ్చు. కాకపోతే.. జనాలకు కనెక్ట్ అవుతాయి. అల్లూరిలో బాగా ఇంప్రెస్ చేసిన సీన్,ఫైట్ ఏమైనా ఉందంటే అది ఇదే.
సెకండాఫ్‌లో ఓ కిడ్నాప్ డ్రామా, పోలీస్ ఆపరేషన్… వీటితో సాగిపోతుంది. కిడ్నాప్ డ్రామాని మరింత డిటైల్ గా చూపించాడు. అది బాగా విసుగొస్తుంది. ఇక చివర్లో పోలీస్ ఆపరేషన్ కూడా సో.. సోగా సాగుతుంది. ఈ ఎపిసోడ్ పోలీసుల త్యాగాల్ని, కర్తవ్య దీక్షని చూపించడానికి వాడుకున్నాడు దర్శకుడు. ఓవరాల్ గా హిట్టయిన ప్రతీ పోలీస్ సినిమాలోనూ కొన్ని బిట్లు తీసుకొని మరో సినిమా తీసిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప, కొత్త సినిమా చూసిన భావన అయితే రాదు. పైగా ఈ కథ చెప్పడానికి ఎంచుకొన్న స్క్రీన్ ప్లేకూడా చాలా పేలవంగా ఉంటుంది. పోలీస్ కావాలని కలలు కంటున్న తన కొడుకులో ఉత్తేజం నింపడానికి తండ్రి (భరణి) అల్లూరి కథ చెబుతాడు. అదేదో ఆ కథ తాను చెప్పకుండా.. తన కొడుకుని అల్లూరి పనిచేసిన ప్రతీ పోలీస్ స్టేషన్‌కీ వెళ్లి, తెలుసుకురమ్మని పంపుతాడు. ఆ స్క్రీన్ ప్లే ఈ కథకు అస్సలు అతకలేదు. దర్శకుడికి ప్రతి సన్నివేశంపైనా విపరీతమైన ఇష్టం ఉన్నట్టుంది. ఆ సీన్ లెంగ్త్ ఎంత? ఎంత చెప్పాలి? అనే విషయాల్ని గాలికి వదిలేశాడు. ఉదాహరణకు తనికెళ్ల భరణి ఎపిసోడే ఓ చిన్న సైజు సినిమాలా ఉంటుంది. దాన్ని అంత లెంగ్తీగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు శ్రీవిష్ణు. ఈ కథ గురించి కూడా గొప్పగా చెప్పాడు. సినిమా చూస్తే… శ్రీవిష్ణు ఇంత గుడ్డిగా నమ్మడానికి ఈ కథలో ఏముంది? అనే అనుమానం వేస్తుంది. కథల ఎంపికలో ఎంతో పరిణతి చూపించే శ్రీవిష్ణు.. ఈ కథని ఎలా ఒప్పుకొన్నాడా? అనిపిస్తుంది. పోలీస్ పాత్రలో చాలా ఫిట్ గా కనిపించాడు శ్రీవిష్ణు. ఈ పాత్ర కోసం నిజాయతీగా కష్టపడ్డాడు. అయితే.. సీరియస్‌గా కనిపించాలన్న తపనలో తనలోని నేచురల్ నటుడ్ని పక్కన పెట్టాడేమో అనిపిస్తుంది. కథానాయిక చేసిందేం లేదు. పాటల్లో కనిపించడం తప్ప. ఈకథలో ప్రధానమైన లోపం.. ఓ విలన్ అంటూ లేకపోవడం. సంఘటనలూ, సందర్భాలే.. ప్రతినాయక పాత్ర పోషిస్తాయనుకొన్నప్పుడు వాటిని బలంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. పాటల్లో ఏదీ ఆకట్టుకోదు. పైగా.. అవి కథకు అడ్డుగోడలా నిలుస్తాయి. సినిమా నిడివి కూడా ఎక్కువే. ట్రిమ్ చేసుకోదగిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
ప్రతీ పోలీస్ కథలోనూ ఎక్కడో ఓ చోట కొత్తదనం కనిపిస్తుంది. ఓ యునిక్ పాయింట్ ఉంటుంది. అలానే రొటీన్ సీన్లూ కనిపిస్తాయి. ఆ రొటీన్సీన్లన్నీ గుది గుచ్చి అల్లూరి తీశారేమో అనిపిస్తుంది. అల్లూరి పాత్రలో ఆవేశం, స్పీచుల్లో అంతర్మథనం తప్ప.. కథలో బలం, సన్నివేశాల్లో నవ్యత ఎక్కడా కనిపించలేదు. దాంతో ఈ అల్లూరి గురి తప్పింది.