సుప్రీంకోర్టు ఆదేశాలతో.. సీబీఐ డైరక్టర్ గా పదవి చేపట్టిన అలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. అలోక్ వర్మ… పదవి చేపట్టిన వెంటనే.. ఐదుగురు సీనియర్ అధికారుల్ని బదిలీ చేశారు. ఈ క్రమంలో ఆయన… కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ.. అలోక్ వర్మ… పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తనను బలవంతంగా సెలవుపై పంపినప్పుడు.. ఇన్ చార్జ్ డైరక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు.. పలువుర్ని బదిలీ చేశారు. కీలకమైన కేసులు విచారిస్తున్న వారిని బదిలీ చేశారు.
అలా బదిలి అయిన వారిలో ఐదుగుర్ని మళ్లీ పాత స్థానాలకు తెచ్చారు అలోక్ వర్మ. ఈ క్రమంలో ఆయన … రాఫెల్ డీల్ కు సంబంధించిన వ్యవహారాలపైనా విచారణకు ఆదేశిస్తారనే ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఇది హాట్ టాపిక్ అవుతూ ఉండగానే.. ఆయనపై .. మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ వేటు వేసినట్లు ప్రకటించారు. వారం రోజుల్లో కొత్త సీబీఐ డైరక్టర్ ను నియమిస్తామని తెలిపింది. వాస్తవానికి సుప్రీంకోర్టు.. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లతో కూడిన .. కమిటీ… అలోక్ వర్మపై నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకున్నారు. ఆ స్థానం జస్టిస్ సిక్రి వచ్చారు. అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టిన వెంటనే హుటాహుటిన… కమిటీ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటు చేశారు. సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ తొలగింపును… మోడీతో పాటు… సుప్రీంకోర్టు జస్టిస్ సిక్రీ కూడా.. సమర్థించారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై వివరణ అడగాలని కోరినా… మోడీ పట్టించుకోలేదు.
ఉన్న పళంగా ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కేంద్రం మాత్రం ఒక్క రోజులో నిర్ణయం తీసుకుంది. నిజానికి అలోక్ వర్మ ఈ నెల 31వ తేదీనే రిటైర్ అవ్వాల్సి ఉంది. ఈ లోపు ఆయనేమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో… ఉన్న పళంగా పదవి నుంచి తొలగించడానికి ప్రధానమంత్రి సిద్ధపడ్డారు. అనుకున్నది సాధించారు.