అర్థరాత్రి రెండు గంటలకు సీబీఐ డైరక్టర్, స్పెషల్ డిప్యూటీ డైరక్టర్లపై వేటు వేయడం.. ఆ స్థానంలో కొత్త బాస్‌ని నియమించడం.. ఆయన తెల్లవారక ముందే… యాక్షన్ లోకి దిగిపోడం.. కేవలం సినిమాల్లోనే సాధ్యం. దాన్ని మోడీ చేసి చూపించారు. ఇంత హడావుడిగా ఎందుకు ఈ ప్రాసెస్ జరిగిందనేది చాలా మందికి తెలియని అంశం. వారిపై ఆరోపణలు ఉంటే… పట్టపగలు చేసుకోవచ్చు కదా.. అర్థరాత్రి.. తెల్లవారు జామున చేయాల్సిన పని ఏముందన్నది.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు.. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. విపక్ష నేతలు… ఈ అంశానికి రాఫెల్ స్కాంతో ముడి పెడుతున్నారు.
రాఫెల్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు అలోక్ వర్మ సేకరిస్తున్నందునే.. ఆయనపై వేటు వేశారని.. రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అవినీతిలో భాగస్వాములు కావడం పతనానికి పరాకాష్టఅని.. కేంద్రంలో బీజేపీ నేతలు ఒక తప్పు చేసి… దానిని కప్పిపుచ్చబోయి తప్పుమీద తప్పులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్లేషించారు.
సీబీఐ డైరెక్టర్‌ను అర్థరాత్రి విధుల నుంచి తొలగించడం చూస్తే…ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం మోడీకి ఇష్టం లేదనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.. ఏ చట్టం, ఏ అధికారం ప్రకారం సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని చంద్రబాబు ప్రశ్నించారు. రాఫెల్స్కాంపై విచారణ చేపడతారన్న భయంతోనే …సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని తేల్చారు. దీని ద్వారా రాఫెల్స్కామ్తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందని…స్పష్టంగా రుజువు అవుతోందన్నారు. తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.స్టాలిన్ తప్పుపట్టారు. నాగేశ్వరరావుపై సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు చాలా ఫిర్యాదులు వెళ్లాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా అలోక్‌వర్మ అనుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో అలోక్‌వర్మను సెలవుపై పంపి నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘రాఫెల్‌పై విచారణ జరక్కుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా ఈ నియామకాన్ని భావించవచ్చా? దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి కనిపిస్తోంది.
నాగేశ్వరరావు లాంటి వివాదాస్పద అధికారిని నియమించడం చూస్తే బీజేపీ ప్రభుత్వ పంజరంలో చిలుకగానే సీబీఐ ఉండబోతోందనడంలో సందేహం లేదు’ అని స్టాలిన్ విమర్శించారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇదే వాదన వినిపించారు. అలోక్ వర్మ తొలగింపు విషయంలో మోడీ నోరు విప్పడం లేదు. ఆయన మాట్లాడితే కానీ..అసలు ఏం జరిగిందో బయటకు తేలే అవకాశం లేదు.