కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఎం రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని హైకోర్టుకు చెప్పింది. ఇంత కాలం సీపీఎం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏపీలో మరే ప్రతిపక్ష పార్టీ కూడా లేనంత సన్నిహితంగా అధికార పార్టీతో అంటకాగుతోంది. వైసీపీ సర్కార్ చల్లని చూపు ఉంటే చాలన్నట్లుగా నొప్పింపక.. తానొవ్వక అన్నట్లుగా రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో హైకోర్టులో … సీపీఎం వేసిన అఫిడవిట్.. ఆ పార్టీ కాస్త తెగించిందనే అభిప్రాయానికి వచ్చేలా చేస్తోంది. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. ముందుగా రాజధాని అంశంలో కేంద్రాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు కానీ.. ఏపీ సర్కార్ పై మాత్రం సుతిమెత్తగా ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని.. రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసంకాదని సీపీఎం మధు తన అఫిడవిట్లో తెలిపారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించింది కేంద్రమే.. ఇప్పుడు ఏపీ రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల నిధులు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో వేల కోట్లను ఖర్చు చేసిన తర్వాత.. రాజధాని తరలింపు సరికాదని.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్ ఏమిటని మధు ప్రశ్నిస్తున్నారు.
రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ సాక్షాత్తు..అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని గుర్తు చేసింది. బయట పోరాడినా పోరాడకపోయినా.. మద్దతిచ్చినా.. ఇవ్వకపోయినా.. ఒక్క వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు.