తమిళ స్టార్ విజయకాంత్ మరణం ఆయన అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మరోవైపు విజయ్‌కాంత్ ది సహజ మరణం కాదని, ఆయన్ని ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆరోపించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇలాంటి ఆరోపణలు ఏ రాజకీయ నాయకులో, విజయ్ కాంత్ అభిమానులో చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. పుత్రేన్ లాంటి దర్శకుడు ఇలా మాట్లాడడం తమిళ నాట చర్చనీయాంశమైంది. ఈ మేరకు సోషల్ మీడియా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని ట్యాగ్ చేస్తూ ఓ పెద్ద పోస్ట్ పెట్టారు పుత్రేన్.
”ఉదయనిధి స్టాలిన్ అన్నా… కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని ‘మీరు రాజకీయాలలోకి రావాలి’ అని చెప్పాను. కరుణానిధిని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని విస్మరిస్తే… ‘ఇండియన్ 2’ సెట్స్‌లో కమల్ హాసన్ గారిని, మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు“ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. విజయ్ కాంత్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఓ దశలో ఆయన చనిపోయాన్న వార్తలు కూడా బయటకు వచ్చేశాయి. అయితే ఏదోలా కోలుకొని మళ్లీ ఇంటికి వచ్చారు విజయ్ కాంత్. ఆ తరవాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడం, ఆస్పత్రి పాలు కావడం.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడం అలా.. జరిగిపోయాయి. విజయ్‌కాంత్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, సడన్ గా చనిపోతే ఈ ఆరోపణల్ని జనాలు కూడా సీరియస్‌గా తీసుకొనేవారేమో..? కనీసం లేని నడవలేని పరిస్థితుల్లో విజయ్‌కాంత్ ని చూసిన అభిమానులు సైతం ఇది సహజ మరణమే అని భావిస్తున్నారు. కాకపోతే నిప్పు లేనిదో పొగ రాదు. మరి ఇవన్నీ ఆరోపణలు, సంచలనం కోసం చేసిన ప్రకటనలేనా? తెర వెనుక ఏమైనా సీక్రెట్ ఉందా? అనేది తేలాలి.