బాక్సింగ్ డే టెస్టులో భారతజట్టు విజయం సాధించడం క్రికెట్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తొలి టెస్టులో ఘోర పరాజయం తరవాత… ఇలాంటి కమ్ బ్యాక్ ఎవ్వరూ ఊహించలేదు. అందునా.. కోహ్లీ, షమీ లాంటి ఆటగాళ్ల గైర్హాజరీలో. బాక్సింగ్ డే టెస్టు అనగానే ఆసీస్ ఎప్పుడూ రెచ్చిపోయి ఆడేస్తుంది. పైగా తొలి టెస్టు లో విజయం సాధించిన ఊపులో ఉంది ఆసీస్. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో భారత జట్టు ఓ టెస్టు విజయం సాధించడం అపూర్వమే అనుకోవాలి.
కోహ్లీ లేకుండా కూడా భారతజట్టు టెస్ట్ మ్యాచ్‌ల్ని గెలవగలదు… అని నిరూపించిన విజయం ఇది. ఈ మ్యాచ్‌లో మరో సానుకూల అంశం ఏమంటే.. రెహానే కెప్టెన్సీ. మైదానంలో రెహానే వ్యూహాలు, బౌలింగ్ మార్పులు మాజీలను మెప్పించాయి. రెహానేలో ఓ కోహ్లీని చూశానని రవిశాస్త్రిలాంటివాడు కితాబు ఇచ్చాడంటే.. రెహానే ప్రతిభేంటో అర్థం చేసుకోవొచ్చు. సునీల్ గవాస్కర్ సైతం రెహానే కెప్టెన్సీని ఆకాశానికి ఎత్తేశాడు. “తను ముంబై వాడు కావడం వల్ల ఎక్కువ చెప్పడం లేదు. కానీ…తను సమర్థవంతమైన కెప్టెన్ గా ఎదుగుతాడు“ అని ఆశీర్వదించాడు గవాస్కర్.
ఆస్ట్రేలియాని, అదీ అస్ట్రేలియాలో ఓడించడం ఏ జట్టుకైనా కష్టం. ఇప్పుడున్న భారతజట్టుకి మరింత కష్టం. కానీ.. తొలి టెస్టు ఓటమి తరవాత అనూహ్యంగా విజృంభించి ఓ విజయాన్ని అందుకుంది భారత్. ఈ విజయంలో రెహానే బ్యాటింగ్ తో పాటు తన కెప్టెన్సీ సమర్థత కూడా కీలక పాత్ర పోషించాయి. ఎప్పటి నుంచో.. కోహ్లీపై కెప్టెన్సీ భారాన్ని తగ్గించాలన్న వాదన వినిపిస్తోంది. కోహ్లీని పరిమిత ఓవర్లకే పరిమితం చేయాలని, టెస్టు కెప్టెన్సీ మరొకరికి అప్పగిస్తే… బాగుంటుందని మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో.. రెహానే ఇప్పుడు ఓ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో… టెస్టు క్రికెట్ పగ్గాలు రెహానే చేతికి చిక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.